బిడ్డ తల్లులు పాలిచ్చే కేంద్రాలు ప్రారంభం


చంటి బిడ్డ తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చేందుకు వీలుగా ప్రతి బస్టాండ్లలో ప్రత్యేక గదులు ఏర్పాటు కానున్నాయి. తొలి విడతగా రాష్ట్రంలో 352 బస్టాండ్‌లలో ఈ గదులు ఏర్పాటు చేశారు. అలాగే, ఏడు ఆసుపత్రుల్లో తల్లి పాల బ్యాంక్‌లను కొలువు దీర్చారు. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత ప్రారంభించారు.

 

 సాక్షి, చెన్నై : సుదూర ప్రయాణం నిమిత్తం బస్టాండ్‌లకు వచ్చే బిడ్డ తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వడానికి కష్టపడాల్సి ఉంది. దీన్ని పరిగణించిన సీఎం జయలలిత చంటి బిడ్డ తల్లుల కోసం ప్రత్యేకంగా గదులను బస్టాండ్‌ల ఆవరణలో ఏర్పాటు చేయడానికి  ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక ఫర్నీచర్స్, బాత్రూం సౌకర్యంతో ఈ గదులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఆమేరకు చెన్నై కోయంబేడుతో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని 532 అతి పెద్ద బస్టాండ్‌లలో ఈ గదులను ఏర్పాటు చేశారు. వీటిని ఉదయం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత ప్రారంభించారు.

 

 

 అలాగే, తల్లి పాల బ్యాంక్‌లను సైతం ప్రారంభించారు. తక్కువ బరువుతో, నెలలు తక్కువగా జన్మించే పిల్లలు, తల్లికి అత్యవసర చికిత్స అందించాల్సి ఉండి పిల్లలకు దూరంగా ఉన్న సమయాల్లో, తల్లిదండ్రులు వదిలి పెట్టి వెళ్లిన పిల్లలకు తదితర వారికి పాలను అందించేందుకు వీలుగా తల్లి పాల బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. చెన్నై ఎగ్మూర్ చిన్న పిల్లల ఆసుపత్రి, మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి, తిరుచ్చి, కోయంబత్తూరు, సేలం, తేని, తంజావూరుల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తల్లి పాల బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ సీఎం జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top