ఆర్కే ఏమయ్యాడు?

ఆర్కే ఏమయ్యాడు? - Sakshi

పోలీసుల కస్టడీలోనే..: విరసం నేత వరవరరావు

ప్రజలే రక్షించుకున్నారు: ఆర్కే భార్య పద్మక్క

మా అదుపులో లేరు: ఏపీ డీజీపీ సాంబశివరావు

ఆర్కేను చంపేశారు: మల్కన్‌గిరి డివిజన్‌ కార్యదర్శి వేణు

ఆర్కే సురక్షితంగానే ఉన్నారు: పౌరహక్కుల సంఘం

భిన్న ప్రకటనలు, వాదనలతో గందరగోళం

 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఆర్కే ఏమయ్యాడు? అసలు ఉన్నాడా? లేడా.. ఉంటే ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? మావోయిస్టు పార్టీలోనే కాదు వామపక్షాలు, ప్రజా సంఘాల్లోనూ ఒకటే ఉత్కంఠ. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఆర్కే విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో స్పందిçస్తున్న తీరుపై గందరగోళం కొనసాగుతోంది. 



మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ (ఆర్కే) ఆచూకీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.‘ఆపరేషన్‌ ఆర్కే’పేరుతోనే మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ జరిగినట్టుగా ఏపీ పోలీసు వర్గాలు సైతం అంగీకరిస్తున్నప్పటికీ ఆర్కే ఏమయ్యాడో అంతు చిక్కని ప్రశ్నగా తయారైంది. సంఘటనా ప్రాంతంలో రెండు శిబిరాల్లో సుమారు 40 మంది మావోలుంటే ఒక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకొని పోలీసులు కాల్పులు జరిపారని, రెండో శిబిరంలో ఆర్కే ఉన్నారనే వాదన వినిపించింది. ఎదురుకాల్పుల సమయంలో ఆర్కేతో సహా చలపతి, గాజర్ల రవి, అరుణ వంటి అగ్రనేతలు తప్పించుకుని ఉంటారని పోలీసులు సంకేతాలిచ్చారు. కానీ ఈ ఘటనలో ఆర్కేతో సహా అగ్రనేతలంతా పోలీసులకు చిక్కారని.. వారిని అక్కడ నుంచి విచారణ పేరుతో వేరే ప్రాంతానికి తరలించుకుపోయారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఏవోబీ ఈస్ట్‌ డివిజన్‌  కార్యదర్శి కైలాసం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.



ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని లేఖ విడుదల చేశారు. ఏపీసీఎల్‌సీ నాయకుడు కల్యాణ రావు సైతం ఆర్కే పోలీసుల కస్టడీలోనే ఉన్నారని.. పోలీసులు వాస్తవాలను తొక్కిపెట్టారని ఆరోపించారు. మరోవైపు కుమారుడు పృధ్వీ అలియాస్‌ మున్నాను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న  పద్మక్క మాత్రం తన భర్త ఆర్కే సురక్షితంగానే ఉన్నారని, ప్రజలే రక్షించి ఉంటారని భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఆర్కే తమ అదుపులో లేరని, అసలు ఆ రోజు సంఘటనా స్థలంలోనే లేరని డీజీపీ సాంబశివరావు చెప్పుకొస్తున్నారు. డీజీపీ వాదనే సరైందని అనుకుంటే... వేరేచోట ఉన్న ఆర్కే ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌పై ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోనీ తప్పించుకున్న ఆర్కే తాను సురక్షితంగానే ఉన్నానని ఎందుకు ప్రకటన చేయడం లేదన్న వాదనలూ ఉన్నాయి. ఆర్కే లాంటి అగ్రనేత మా అదుపులో ఉంటే ఎందుకు మా దగ్గర ఉంచుకుంటామని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ పేర్కొన్నారు.

 

వేణు ప్రకటనతో అలజడి

గత ఐదు రోజులుగా వస్తున్న పొంతన లేని వాదనలకు భిన్నంగా శుక్రవారం మల్కన్‌గిరి డివిజన్‌ కార్యదర్శి ప్రతాప్‌ అలియాస్‌ వేణు పేరిట వెలువడిన ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది. 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో  ఆర్కేని దారుణంగా చంపేశారని ఆయన శుక్రవారం ముంచంగిపుట్టు మండల విలేకరులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. చలపతి, అరుణ మాత్రం తప్పించుకున్నా ఆర్కే మాత్రం పోలీసుల తూటాలకు బలయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు. పోలీసులు ఆర్కే మృతదేహాన్ని దాచి కుటుంబసభ్యులను, ప్రజా సంఘాల నాయకులను తప్పుదోవ పట్టించారని ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు వేణు పేరిట వచ్చిన ఫోన్‌కాల్‌ అంతా డ్రామా అని, అదంతా పోలీసుల నాటకంలో భాగమని పొరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్‌ వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్కే ఎక్కడున్నాడో తెలియదు కానీ సురక్షితంగానే ఉండి ఉంటారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో 18మంది మాత్రమే మావోయిస్టులని, మిగిలిన వారంతా మిలీషియా సభ్యులు, వాళ్లకు ఆహారం తీసుకువెళ్లిన అమాయక గిరిజనులేనని ఆయన ఆరోపించారు. 

 

ఆ నలుగురు ఎక్కడున్నట్టు..?

కాల్పుల ఘటన నుంచి ఆర్కే తప్పించుకున్నప్పటికీ ఇంకా సురక్షిత ప్రదేశానికి వెళ్లలేదని, అందుకే ఆయన్నుంచి సంకేతాలు రావడం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఏవోబీ అడవుల నుంచి తప్పించుకున్న ఆర్కే మైదాన ప్రాంతానికి చేరుకోవడానికి సమయం పడుతుందని, అందుకే ఆయన ఆచూకీ విషయంలో జాప్యం జరుగుందన్న వాదనలూ ఉన్నాయి. ఆర్కే కాకున్నా గాజర్ల రవి, చలపతి, అరుణల్లో ఎవరో ఒకరి నుంచి స్పష్టమైన సంకేతం వస్తేనే ఆ నలుగురి ఆచూకీపై నెలకొన్న గందరగోళానికి తెరపడుతుంది.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top