‘తాత్కాలికం’ ఖర్చు రూ.515 కోట్లు

‘తాత్కాలికం’ ఖర్చు రూ.515 కోట్లు


వెలగపూడిలో సిద్ధమైన అసెంబ్లీ, శాసన మండలి భవనం

అసెంబ్లీ హాల్‌లో సభ్యులకు 231 సీట్లు, మండలిలో 90 సీట్లు 

సీఆర్‌డీఏ కమిషనర్‌ కార్యాలయం వెల్లడి




సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి రూ.515.19 కోట్లు ఖర్చు చేసినట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ కార్యాలయం తెలిపింది. 45 ఎకరాల విస్తీర్ణంలో ఆరు భవనాల సివిల్‌ పనుల కోసం రూ.200.98 కోట్లు, విద్యుత్, ఏసీ, ఫర్నీచర్‌ వంటి పనుల కు రూ.314.21 కోట్లు వినియోగించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1, 2 భవనాల నిర్మాణానికి రూ.67.02 కోట్లు, 3, 4 భవనాల నిర్మాణానికి రూ.66.98 కోట్లు, 5, 6 భవనాల నిర్మాణానికి రూ.66.98 కోట్లు వినియోగించినట్లు తెలిపింది.



భవన సముదాయంలో మౌలిక వసతులకు రూ.113.38 కోట్లు, 1, 2 భవనాల్లో ఎలక్ట్రికల్, లైటింగ్, ఏసీ, ఫర్నీచర్, ఆడియో, వీడియో వ్యవస్థ, బీఎంఎస్, ఐబీఎంఎస్, కాన్ఫరెన్స్‌ హాల్‌ కోసం రూ.66.15 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. 3, 4, 5, 6 భవనాల్లో ఇవే పనులకు రూ.134.68 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఆరు భవనాల్లోనూ పబ్లిక్‌ అడ్రస్‌ వ్యవస్థ ఉంటుందని, ముఖ్యమంత్రి భవనం నుంచి అన్ని భవనాలకు స్పీకర్ల ద్వారా ఒకేసారి సందేశం పంపే ఏర్పాటు ఉన్నట్లు తెలిపింది. భవన సముదాయంలో అంతర్గత రోడ్లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్, ఎక్స్‌టర్నల్‌ లైటింగ్, 12 కిలోమీటర్ల నీటి పైపులైను, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌ సెక్యూరిటీ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు వివరించింది.



హంగులతో అసెంబ్లీ

సచివాలయ సముదాయంలో నిర్మించిన శాసనసభ, శాసనమండలి భవనాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దినట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ కార్యాలయం పేర్కొంది. అసెంబ్లీ హాల్‌లో సభ్యులకు 231 సీట్లు, శాసన మండలిలో సభ్యులకు 90 సీట్లతోపాటు స్పీకర్‌ పోడియాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేసినట్లు వివరించింది. నిర్మాణ సమయంలో సగటున రోజుకు 2,400 మంది కార్మికులు, 130 మంది ఇంజనీర్లు పనిచేశారని తెలియజేసింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top