తెలుగు భాషను మరవొద్దు


అనంతపురం క ల్చరల్ : పర భాష మోజులో పడి కన్నతల్లి లాంటి తెలుగు భాషను మరవొద్దని వక్తలు పేర్కొన్నారు. వాడుక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని సోమవారం నగరంలోని ఆర్‌‌ట్స కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగుభాషా దినోత్సవం నిర్వహించారు. ‘మా తెలుగు తల్లికి మల్లపూ దండ’ గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది. ‘కమ్మనైన తెలుగు భాష.. కలనైన మరవొద్దు’ అంటూ శ్రీధర్‌నాయుడు ఆలపించిన భాషోద్యమ గీతం స్పందింపజేసింది.



ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బ్రహ్మానందం, ఆర్‌‌ట్స కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రంగస్వామి, సీనియర్ అధ్యాపకులు సింహాద్రి, పీజీ తెలుగు కో ఆర్డినేటర్ మల్లికార్జున తదితరులు తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. వందేళ్ల కిందటే తెలుగు భాష అచ్చు గ్రాంధికంలో ఉండటంతో జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి వ్యవహారిక (వాడుక) భాష అవసరమని గుర్తించిన గిడుగు రామ్మూర్తి, గురజాడ, ఆదిభట్ల నారాయణదాసు వంటి వారి దార్శనికత అత్యద్భుతమన్నారు.



వారి ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు. వ్యవహార భాష ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విద్యార్థులకు విధిగా తెలుగును వంటబట్టించడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల కృషి ఎక్కువగా ఉండాలని సూచించారు. తెలుగుభాష సుసంపన్నానికి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రాంతాల వారు సమానంగా కృషి చేశారన్నారు.  



అనంత వాసులలో సాహిత్యం పట్ల అభిమానం ఎక్కువని కొనియాడారు.  అనంతరం బ్రహ్మానందంను పూర్వ విద్యార్థులు, ఆధ్యాపకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు  డాక్టర్ జూపల్లి ప్రేమ్‌చంద్, జెన్నే ఆనంద్, లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి, సుందరమోహనరెడ్డి, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.

 

సాహితీ అభిమానుల అసంతృప్తి : తెలుగు భాషా దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం పట్ల పలువురు సాహితీ అహిమానులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల ముందు నుంచే హడావుడి చేసే తెలుగు భాషా వికాస ఉద్యమ నిర్వాహకులు కూడా ఈసారి మిన్నకుండిపోవడం నిరాశ కలిగించిందన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top