జలప్రభకు బ్రేక్..

జలప్రభకు బ్రేక్.. - Sakshi

మెదక్ : ఇందిర జలప్రభ వెలుగులు ఆగిపోయాయి. టీఆర్‌ఎస్ సర్కార్ రాగానే ఈ పథకాన్ని నిలిపివేయడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే పథకం కింద కొంత మంది వ్యవసాయం చేస్తుండగా, తమ పొలాలు బీడుగానే ఉండిపోయాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూముల్లో బోర్లు తవ్వించి బోరు మోటార్‌తోపాటు కరెంట్ లైన్ వేసి వాటిని సాగుకు యోగ్యంగా మార్చాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఇందిర జలప్రభ పేరుతో ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి పదెకరాల భూములను గుర్తించి అందులో ఎంతమంది రైతులున్నా వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం బోరు తవ్వించడంతోపాటు పంపుసెట్లు అమర్చింది. విద్యుత్ లైన్ లాగి వారికి అప్పగించింది. దీంతో ఎంతోమంది నిరుపేద ఎస్సీ, ఎస్టీలు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇందిర జలప్రభ పథకాన్ని తొలగించి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌కు అనుసంధానం చేసింది. 

 

వీరి పరిస్థితేంటి?

జలప్రభ స్కీమ్‌ను నిలిపివేయడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కొంతమంది భూముల్లో బోరు బావులు తవ్వి, పంపుసెట్లు అమర్చకుండా, కరెంట్ లైన్ వేయకుండా వదిలేశారు. తాము వ్యవసాయం చేసుకుందామంటే అర్ధంతరంగా బోర్లు తవ్వి వదిలేశారని, దీంతో తమ భూములు బీళ్లుగానే ఉండిపోతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర జల ప్రభ పథకాన్ని ప్రవేశ పెట్టి నాబార్డు నిధులను మళ్లించి జిల్లాలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ రైతుల అభివృద్ధికి కృషి చేసింది.  కాగా ఇందుకు సంబంధించి కొంతమందికి బోరు మోటార్లు అందించగా, మరికొంతమందికి పొలాల్లో బోర్లు వేసి వదిలేశారు. 

 

నాలుగేళ్లలో ఇలా...

జిల్లాలో గడిచిన నాలుగేళ్లలో సుమారు 4,560 బోరు బావులు తవ్వించగా, అందులో 2,200 బోరుబావుల్లో పంపుసెట్లు బిగించారు. ఇందుకుగాను 1,500పై చిలుకు ఎస్సీ, ఎస్టీ రైతులు లబ్ధిపొందినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 1,500 పైచిలుకు మిగిలిన పనులను అలాగే వదిలేయడంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ పొలాల్లో మోటార్లు బిగించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top