అల్లుడు గిల్లుడు రూ. 100 కోట్లు

అల్లుడు గిల్లుడు రూ. 100 కోట్లు - Sakshi

  • టీడీపీ కీలక నేత బంధువు భూ దందా

  •  ముప్పై ఎకరాల సీలింగ్ భూములు కొట్టేసేందుకు భారీ కుట్ర

  •  పేదలకు పంచాల్సిన స్థలాలను పంచకుండా నొక్కేసిన పెద్దలు

  •  ఇప్పుడు వారికి అండగా రంగంలోకి దేశం నేత అల్లుడు

  •  విలువైన భూములను కొట్టేసి పేదలకు కారుచౌక స్థలాలు అప్పగించాలని వ్యూహం

  •  అధికారుల అండదండలు

  • దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. అక్రమార్కులు.. అధికారం కలిసి సీలింగ్ భూముల స్వాహాకు స్కెచ్ వేస్తున్నారు..ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం.. ఓ పెద్దాయన ప్రభుత్వానికి మిగులు భూములు ఇచ్చేసి పెద్దమనసు చాటుకుంటే..ఆయన బంధువులు మాత్రం రాబందుల్లా మారి.. వాటిలో చాలా వరకు మళ్లీ మళ్లీ అమ్మేసుకున్నారు.. పీకల మీదకొచ్చేసరికి.. కోట్ల విలువ చేసే ఈ భూములకు బదులు ఎందుకూ పనికిరాని భూములిస్తామని మెలిక పెడుతూ కోర్టును ఆశ్రయించారు.

     

    ఈ కేసు ఇంకా పెండింగులో ఉండగానే.. టీడీపీ కీలక నేత అల్లుడుగారు రంగంలోకి దిగారు.. ఒక్క గజం కూడా ప్రభుత్వానికి గానీ.. ఇతరులకు గానీ ఇచ్చే పని లేకుండా.. అన్నీ మనమే పంచేసుకుందామని రా‘బంధువు’లను గిల్లారు.. అధికార అండ లభించడంతో రూ. వంద కోట్ల విలువైన 30 ఎకరాల భూములను కొట్టేసే భారీ కుట్రకు తెరలేపారు.

     

     సీలింగ్ చట్టం ప్రకారం సర్కారుకు అప్పగించాల్సిన ఆనందపురం మండలంలోని విలువైన భూములు బదులు జిల్లాలోని వేరే ప్రాంతంలో కారుచౌకగా లభించే భూములను బదలాయించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.పిల్లనిచ్చిన మామ.. ఆయన అడుగులకు మడుగులొత్తే అధికారగణం అండతో అల్లుడు సాగిస్తున్న ఈ గిల్లుడు దందా ఎలా ఉందంటే..

     

    సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :  నిరుపేదలకు పంచిపెట్టాల్సిన సీలింగ్ భూములను దశాబ్దాలుగా తొక్కిపెట్టిన పెద్ద లు.. ఇప్పుడు టీడీపీ కీలక నేత అల్లుడి అండతో సరికొత్త భూదందాకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వానికి వదిలేయాల్సిన విలువైన భూములకు బదులు.. ఎక్కడో నర్సీపట్నంలో మారుమూల ప్రాంతంలో ఉన్న భూములు కట్టబెట్టేందుకు భారీ వ్యూహం పన్నారు. ఈ భూభాగోతం పూర్వాపరాలు తెలుసుకోవాలంటే 1973వ సంవత్సరానికి వెళ్లాల్సిందే..

     

     మిగులు భూముల అప్పగింత

     ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి చెందిన కోరాడ వెంకటస్వామినాయుడు 1973లో ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం తమ కుటుంబం పేరిట ఉన్న 45.59 ఎకరాల మిగులు భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించారు. 1975లో ఆయన ఇచ్చిన భూ వివరాలను పరిశీలించిన ల్యాండ్ సీలింగ్ అథారిటీ ఆ భూముల అప్పగింతపై ట్రిబ్యునల్ తీర్పు(ఎల్‌పీసీ 230/75) ఇచ్చింది.

     

     ఈ మేరకు విశాఖ రూరల్ మండలం మధురవాడలో 262/4, 263/2, 276/1, 278, 276/2, 277/2, 329, 262/3, 2771/1 సర్వే నెంబర్లలోని 28.84 ఎకరాలు, ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో 1.66ఎకరాలు, ఆనందపురం గ్రామంలో 6.81ఎకరాలు, వెల్లంకి గ్రామంలో 8.28 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే వెంకటస్వామినాయుడు కాలం చేసిన తర్వాత అసలు కథ మొదలైంది. ఆయన కుటుంబీకుల్లో కొందరు ప్రభుత్వానికి ఇచ్చేసిన భూములను  అడ్డగోలుగా విక్రయించేశారు.

     

     సర్కారుకిచ్చిన భూములనే మళ్లీ... మళ్లీ అమ్మేశారు

     మధురవాడ పంచాయతీ పరిధిలో ప్రభుత్వానికి ఇచ్చిన 28.84 ఎకరాలను కోరాడ వారసులు కృష్ణా కో-ఆపరేటివ్ సొసైటీకి విక్రయించేశారు. దీనిపై అప్పటి చినగదిలి  ఎమ్మార్వో  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కోరాడ వారసులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

     

     తమ కుటుంబ అవసరాల కోసం ఆ భూములను విక్రయించేశామని, వాటికి బదులుగా ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ బంటుపల్లి వారి కల్లాలు గ్రామంలో ఉన్న 28.80 ఎకరాల (సర్వే నెంబర్లు 391/1, 39/2) భూమిని ఇస్తామన్నది వారి పిటిషన్ సారాంశం. దానికి కోర్టు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను వెంటనే అమలుచేసి భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు తాత్సారం చేశారు.

     

     దీంతో వారసులు మరోసారి ఆ భూముల్లో కొన్నింటిని 2006లో విక్రయించేశారు.  సర్వే నెంబర్ 39/1, 39/5ఏలలో 11.8 ఎకరాలను విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన డి.ఎస్.రాజు, పి.వి.నర్సింహరాజులకు విక్రయించేశారు. అదేవిధంగా వెల్లంకి గ్రామంలో ప్రభుత్వానికి ఇచ్చేసిన 1.14 ఎకరాలను గారిపేట వాస్తవ్యులు కోరాడ అప్పలస్వామి, రాములకు విక్రయించేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా, ఆ భూమికి బదులు సర్వే నెంబర్ 263/2, 264/16లోని 1.14 ఎకరాలు అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ 263/2 సర్వేన ెంబర్‌లోని 0.34 ఎకరాల భూమిని అమ్మేశారు.

     

     విలువైన భూములు వదిలిస్తే.. మారుమూల చోట స్థలాలు ఇస్తారట

     మొత్తంగా 30 ఎకరాల పంపిణీకి సంబంధించిన పక్కా వివరాలు లేకున్నా కోరాడ కుటుంబీకులు మాత్రం ఇప్పటికే తాము 34.45 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించామని లెక్క కట్టేశారు. మరో 11.14 ఎకరాలు మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని తేల్చేశారు. ఆ 11.14 ఎకరాల విషయంలోనూ మతలబు పెట్టారు. గతంలో తాము ఆనందపురం గ్రామంలో అప్పజెప్పిన 4.15ఎకరాలు రెండుపంటలు పండే భూమి అని పేర్కొన్నారు. పంటలు పండే భూమి, మిగులు భూముల నిష్పత్తి (1:2) ప్రకారం.. 11.14 ఎకరాల్లో 4.15 ఎకరాలు మినహాయించాలని ప్రతిపాదించారు. ఈ లెక్కన తాము కేవలం 6.63 ఎకరాలు ఇస్తే సరిపోతుందని.. దాన్ని  కూడా నర్సీపట్నం పరిసరాల్లో ఇస్తామని ప్రతిపాదించారు. ఈ లెక్కలతోనే కల్లాలు గ్రామంలోని 11.14 ఎకరాల భూమిని తమకు వదిలేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జిల్లాకోర్టులో కేసు వేశారు.

     

     పేదలకు పంచింది 14 ఎకరాల్లోపే..

     కోరాడ వెంకటస్వామినాయుడు దాదాపు నలభై ఏళ్ల కితం 45.59 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం పేదలకు పంచిన భూమి 14 ఎకరాలు కూడా లేదంటే ఆయా భూముల పంపిణీ తంతు ఏవిధంగా ఉం దో అర్ధం చేసుకోవచ్చు. ఆనందపురం గ్రామంలో సర్వే నెంబర్ 95బై1లోని 2.05 ఎకరాలు, 97/2లోని 2.46 ఎకరాలు, 235/2లోని 3.21ఎకరాలు, వెల్లంకి గ్రామంలోని 4.48 ఎకరాలనే ఇప్పటివరకు ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసిం ది. మిగిలిన భూముల లెక్క అధికారుల వద్ద కూడా పక్కాగా లేకపోవడం అనుమానాలకు తావి స్తోంది. ఇక మధురవాడలో కృష్ణా కో-ఆపరేటివ్ సొసైటీకి అమ్మేసిన 28.80 ఎకరాలకు బదులు బంటుపల్లివారి కల్లాలు గ్రామంలో ఇస్తామన్న భూమి వివరాలు కూడా అధికారుల వద్ద లేవు.


     తాజాగా.. రంగంలోకి దేశం నేత అల్లుడు

     కేసు కోర్టులో ఉండగానే జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి కుమార్తె భర్త రంగంలోకి దిగారు. కోరాడ వారసులకు, టీడీపీ నేత అల్లుడికి మధ్య ఆనందపురం మండల టీడీపీ నాయకుడు మధ్యవర్తిత్వం నెరిపాడు. అధికారికంగా పేర్కొంటున్న 11.14 ఎకరాలతో సహా తొక్కిపెట్టిన  30 ఎకరాలకుపైగా భూమికి సంబంధించి ఒక్క గజం కూడా ఎవ్వరికీ పంపిణీ చేయకుండా పంచేసుకునేందుకు వారంతా కలిసి ప్రణాళిక రూపొందించారు. రియల్ మార్కెట్ బూమ్ ఉన్న ఆనందపురం మండలంలో ఎకరా ధర రూ 3 కోట ్లనుంచి రూ. 4 కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన దాదాపు వంద కోట్ల విలువైన 30 ఎకరాలకుపైగా భూమిని సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కోర్టు ఉత్తర్వులు తమకు అనుకూలంగా వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. అధికారులకు అన్ని విషయాలు తెలిసినా.. నేతలతో  కుమ్మక్కై వాస్తవాలు తొక్కిపెట్టేస్తున్నారు. పాత రికార్డుల బూజు దులిపి వాస్తవాలను కోర్టుకు తెలియజేయడానికి ప్రయత్నించడం లేదు.





     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top