నయన్‌పై రాజకీయ కన్ను

నయన్‌పై రాజకీయ కన్ను


నటి నయనతారపై రాజకీయ కన్ను పడుతోంది. ఆమె క్రేజ్‌ను వాడుకోవాలని తమిళనాట కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. రాజకీయాల్లో సినీ తారలన్నది కొత్తేమీకాదు. ఇక్కడి నుంచి వెళ్లి రాష్ట్రాన్ని ఏలినవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నటిగా నయనతార స్టామినా గురించి ఇప్పుడు ప్రస్థావించనక్కర్లేదు. ఈ సంచలన తార బహుభాషా నటి. రెండు సార్లు ప్రేమలో పడి పెళ్లి అంచుల వరకూ వెళ్లి మూడు ముళ్లకు దూరమయ్యి నటనే వద్దనుకుని మళ్లీ దాన్నే ఆశ్రయించి విజయాల బాట పట్టిన సంచలన నటి నయన్. కోలీవుడ్‌లో రాజా రాణి చిత్రంతో రీఎంట్రీ అయ్యి హీరోయిన్‌గా సక్సెస్ అయిన ఈ కేరళా కుట్టికి మధ్యలో కొన్ని అపజయాలు ఎదురయ్యాయి. ఇటీవల తనీఒరువన్, మాయ చిత్రాలు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం ఐదారు చిత్రాలు చేతిలో ఉన్నాయి.

 

 రాయకీయ గాలం

 ఇటీవల నయనతార ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి సేలం వెళ్లారు. అక్కడ ఆమెను చూడటానికి ఒక పెద్ద కూటమే తరలి వచ్చింది. ఎంత పెద్ద కూటమి అంటే రాజకీయ వర్గాలే ఆశ్చర్యపడేంతగా. సుమారు ఐదు వేలకు పైగా వచ్చిన నయనతార అభిమానుల్ని చూసి రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిందట. ఆమెను ఎలాగయినా తమ పార్టీలోకి లాగాలని కొన్ని రాజకీయపార్టీలు ఆలోచనలు చేస్తున్నాయని సమాచారం.

 

 డీఎంకే ముందంజ

 బీజేపీ, డీఎంకే పార్టీలు నమనతారను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆల్ రెడీ ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో డీఎంకే కాస్త ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఒక డీఎంకే నేత స్పందిస్తూ రాజకీయంగా ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చాలా బలంగా ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో డీఎంకేకు ప్రచారాస్త్రంగా ఒక పాపులర్ వ్యక్తి అవసరం ఉందన్నారు. సేలంలో నటి నయనతార క్రేజ్‌ను చూసిన తరువాత ఆమెను పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచన వచ్చిన మాట నిజమేనన్నారు. కొన్నేళ్ల క్రితం నటి కుష్భూ డీఎంకే పార్టీలో చేరారని, తన పార్టీకి విశేష సేవలు అందిచారని అన్నారు. అయితే కుష్భూ నిర్మోహమాట వ్యాఖ్యలు, చర్యలు పార్టీలోని కొందర్ని ఇబ్బందికి గురి చేశాయన్నారు. దీంతో ఆమె పార్టీలో ఎక్కువ కాలం కొనసాగలేక పోయారని చెప్పారు. ఇప్పుడామె స్థానంలో నయనతార లాంటి ఒక స్టార్ నటి అవసరం అయ్యారని చెప్పుకొచ్చారు.

 

 నయనతార మాటేంటి

  నటి నయనతార గురించి రాజకీయ చర్చ వాడివేడిగా జరుగుతుంటే ఆమె వర్గం మాత్రం నయనతారకు ఇప్పట్లో రాజకీయ ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉందని అంటున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top