గ్రూపు రచ్చ

గ్రూపు రచ్చ


సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో గ్రూపుల రచ్చ ఢిల్లీకి చేరింది. చిదంబరం ఫిర్యాదుతో రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఢిల్లీకి పరుగులు తీశారు. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లతో చిదంబరం మద్దతు దారులు దాడికి దిగారు.

  రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఈ వివాదాలే ఆ పార్టీకి గడ్డు పరిస్థితులను కల్పించాయి. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ తమిళ మానిల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం మరింత తగ్గింది. రాష్ట్ర పార్టీకి  కొత్త అధ్యక్షుడిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ బాధ్యతలు చేపట్టిన క్షణాల్లో వాసన్ వ్యతిరేక శక్తులందరూ ఏకమయ్యారు. తామంతా ఐక్యతతో బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ప్రగల్బాలు పలికారు.

 

 ఈ ఐక్యతను చాటుకుని నెలలు గడవక ముందే, మళ్లీ గ్రూపులు రచ్చకెక్కాయి. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గానికి షాక్‌లు ఇచ్చేరీతిలో ఈవీకేఎస్ మద్దతు దారులు గళాన్ని పెంచారు. ఈ వ్యాఖ్యల యుద్ధం చివరకు తారా స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో మరో మాజీ మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్‌కు టాటా చెప్పడంతో పాటుగా అటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ మీద దుమ్మెత్తి పోసి వెళ్లారు. ఇందుకు స్పందించిన ఈవీకేఎస్ నోరు జారారు. చిదంబరంతో కయ్యానికి కాలు దువ్వుతూ తీవ్రంగానే స్పందించడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది.

 

 చిదంబరం ఫిర్యాదు : జయంతి నటరాజన్ బయటకు వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్‌కు నష్టం లేదని ఈవీకేఎస్ వ్యాఖ్యానించారు. ఆమె బాటలోనే తండ్రి, తనయుడు నడిస్తే రాష్ర్ట కాంగ్రెస్‌కు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందని పరోక్షంగా చిదంబరం, ఆయన తనయుడు కార్తీలను ఉద్దేశించి ఈవీకేఎస్ వ్యాఖ్యానించ డం ఢిల్లీకి చేరింది. తనను, తన కుమారుడిని పార్టీ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించే అధికారం ఈవీకేఎస్‌కు ఎవరు ఇచ్చారంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చిదంబరం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఫలితంగా, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా ఓ పెద్ద గ్రూపే బయలుదేరడం గమనార్హం.

 

 ఢిల్లీకి పరుగు : ఈవీకేఎస్‌ను తప్పించాలంటూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఢిల్లీకి ఫిర్యాదులు చేశారుు. ఈవీకేఎస్ రూపంలో వాసన్ బయటకు వెళ్లాల్సి వచ్చిందని, జయంతి నటరాజన్ అదే బాటలో పయనించారని పేర్కొన్నారు. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఢిల్లీకి నుంచి పిలుపు రావడంతో ఆగమేఘాలపై విమానం ఎక్కాల్సిన పరిస్థితి ఈవీకేఎస్‌కు ఏర్పడింది. ఉదయాన్నే ఢిల్లీకి పరుగులు తీసిన ఈవీకేఎస్ అధినేత్రిని, యువరాజును కలుసుకుని తన వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. సోనియా , రాహుల్ గాంధీ ఈవీకేఎస్‌కు తీవ్రంగానే క్లాస్ పీకినట్టుగా వచ్చిన సంకేతాలతో చిదంబరం వర్గం పోస్టర్ల హల్‌చల్ సృష్టించే పనిలో పడింది.

 

 పోస్టర్లతో : ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఈవీకేఎస్‌ను ఉద్దేశించి తీవ్రంగానే ఆ పోస్టర్లలో స్పందించారు. ఈవీకేఎస్‌ను ఖండించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పోస్టర్లు వెలిశారుు. చిదంబరం మద్దతు నాయకుడు ఎస్‌ఎం కుమార్ పేరిట చెన్నై నగరంలో పలు చోట్ల గోడలకెక్కిన ఈ పోస్టర్లు ఈవీకేఎస్ వర్గంలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నారుు. ఈ పోస్టర్ల వివాదం మరిన్ని ఎపిసోడ్‌లుగా సాగబోతుందో వేచి చూడాల్సిందే. తమ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నుంచి వచ్చిన పిలుపుతో ఢిల్లీకి వెళ్ల లేదని ఈవీకేఎస్ వర్గం పేర్కొంటోంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈవీకేఎస్, మహిళా నాయకురాలు, నటి కుష్భు ప్రచారం చేపట్టబోతున్నారని, అందుకే ఆ ఇద్దరు వేర్వేరుగా ఢిల్లీ బాట పట్టినట్టు పేర్కొంటున్నారు.  

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top