కాంగ్రెస్‌కు ‘గ్లామర్’


సాక్షి, చె న్నై: తమిళ రాజకీయాల్లో సినీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎం డీకే, ఎస్‌ఎంకే అధినేతలు సినీ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఆయా పార్టీల్లోనూ నటీ నటులు ఉన్నారు. ఎన్నికల వేళ వీరిని ప్రచారాస్త్రాలుగా ఆయా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. తాజా లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా నటి ఖుష్భు , నటుడు వాగై చంద్ర శేఖర్ వంటి వారు, అన్నాడీఎంకేకు నటులు వింధ్య, కుయిల్, సెంథిల్, రామారాజ్, ఆనందరాజ్ వంటి వారు ప్రచారంలో దూసుకెళుతున్నారు. డీఎండీకేకు విజయకాంత్ పెద్ద గ్లామర్. అయితే, కాంగ్రెస్ సినీ గ్లామర్ కోసం తీవ్రంగానే కుస్తీలు పట్టింది. ఎట్టకేలకు అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి నేత, నటుడు కార్తీక్‌ను తమ వైపు తిప్పుకున్నారు. తమ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు కార్తీక్ ప్రత్యేక ఆకర్షణ అయ్యా రు. ఈ పరిస్థితుల్లో ముంతాజ్ సైతం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాట పట్టారు.

 

 ప్రచారంలో ముంతాజ్: ఖుషీ, అత్తారింటికి దారేదిలో ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకారు హృదయాల్లో చోటు దక్కించుకున్న ముంతాజ్, తమిళంలో అనేక చిత్రాల్లో హీరోయిన్‌గాను, ఐటమ్స్ సాంగ్స్‌లతో, వ్యాంప్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. నమిత రాక ముందు, తన కంటూ ప్రత్యేకంగా గ్లామర్ ప్రపంచాన్ని సృష్టించుకున్న ముంతాజ్ ప్రస్తుతం సినీ అవకాశాలు కరువై ఖాళీగానే ఉన్నారు. దీంతో ఆమెను తమ పార్టీ తరపున ప్రచారానికి ఉపయోగించుకునేందుకు కాం గ్రెస్ నిర్ణయించింది. ఖాళీగా ఉన్న ముంతాజ్ ప్రజల్లోకి వెళ్దామనుకుని ప్రచార బాట పట్టారు. వేలూరు, అరక్కోణం లోక్ సభ పరిధుల్లో శనివారం రాత్రి ఓపెన్ టాప్ వాహనంలో ముంతాజ్ చక్కర్లు కొట్టారు. ఆమె ను చూడ్డానికి కుర్రకారు ఎగబడ్డారు. దీంతో ఉక్కిరి బిక్కిరైన ముంతాజ్ కాస్తో, కుస్తో వచ్చిన తమిళాన్ని కూడా మరచినట్టున్నారు. ఆంగ్లలో తమిళ వ్యాఖ్యలను రాసుకుని, రెండు భాషల్ని కలిపి కొడుతూ...  జనం గుమికూడిన చోట ప్రసంగించాల్సి వచ్చిందట!. అయితే, తమ ప్రచారాలకు ‘గ్లామర్’ చేకూరిందంటూ కాంగ్రెస్ నేతలు తెగ సంబరపడిపోవడం గమనార్హం.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top