జయకు షాక్

జయకు షాక్ - Sakshi

  • చెల్లని భవానీసింగ్ నియామకం

  •   పునర్విచారణ లేదనడంతో జయకు ఊరట

  •   తీర్పు తీవ్రంగా ఉండాలని సూచించిన సుప్రీం

  •  

     చె న్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అప్పీలుపై నియమితులైన ప్రభుత్వ న్యాయవాది భవానీసింగ్ నియామకం చెల్లదని సుప్రీం కోర్టు సోమవారం తీర్పుచెప్పి షాక్‌కు గురిచేసింది. అలాగని కేసుపై పునర్విచారణ అవసరం లేదని ప్రకటించడం ద్వారా జయకు ఊరటనిచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఒకే తీర్పులో జయకు షాక్, ఊరట చోటుచేసుకోవడం విశేషం. జయ ఆస్తుల కేసుపై కర్ణాటక ప్రత్యేక కోర్టు గత ఏడాది సెప్టెంబరు 27వ తేదీన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

     

     అదే ఏడాది అక్టోబరు 17వ తేదీన జయ బెయిల్‌పై బయటకు వచ్చారు. కర్ణాటక కోర్టు తీర్పుపై జయలలిత సుప్రీం కోర్టులో చేసిన అప్పీలును విచారించాల్సిందిగా కర్ణాటక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమారస్వామిని సుప్రీం కోర్టు నియమించింది. జయ తరఫున వాదించేందుకు తమిళనాడు ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా భవానీసింగ్ నియమితులయ్యారు. జయ తరఫున వాదనను భవానీసింగ్ దాదాపు పూర్తి చేయగా 90 శాతం తీర్పు ప్రతులు కూడా సిద్ధమైనట్లు సమాచారం.

     

      మరికొన్ని రోజుల్లో జయ కేసులో తీర్పు వెలువడుతుందని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న దశలో భవానీసింగ్ నియామకం చెల్లదంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చే శారు. దీనిపై విచారణకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించింది. విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి మదన్‌లోకూర్ భవానీసింగ్ నియామకం చెల్లదని, మరో న్యాయమూర్తి భానుమతి చెల్లుతుందని ఈనెల 4వ తేదీన  ఇద్దరూ భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ పరిణామంతో సుప్రీం కోర్టు మరోసారి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు ఈ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్కే అగర్వాల్, ప్రపుల్ల సీ చంద్ ఈనెల 21వ తేదీ విచారణ ప్రారంభించి సోమవారం తీర్పు చెప్పారు.

     

     హక్కు, అధికారం లేదు : సుప్రీం

     జయ ఆస్తుల కేసులో అప్పీలుపై విచారణకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా భవానీసింగ్ నియామకం చెల్లదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టమైన తీర్పుచెప్పింది. ప్రభుత్వానికి హక్కు, అధికారం లేదని, చట్టప్రకారం ఇది మోసపూరితమైన చర్య అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం లేదని తోసిపుచ్చింది. భవానీ సింగ్ నియామకం చెల్లనంత మాత్రాన జయ ఆస్తుల కేసును మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటిషన్‌దారుడు అన్బళగన్ తన వాదనను ఈనెల 28వ తేదీలోగా లిఖితపూర్వకంగా కర్ణాటక కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. పిటిషనర్ ప్రతిని స్వీకరించిన అనంతరం తీర్పు చెప్పాల్సిందిగా కర్ణాటక న్యాయమూర్తి కుమారస్వామిని అదేశించింది. న్యాయమూర్తి తీర్పు చెప్పేముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. దేశంలో అవినీతి, లంచగొండితనం పెరిగిపోయి దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని నిర్మూలించేలా తీర్పుచెప్పాలని సూచించింది.

     

     సుప్రీం వ్యాఖ్యలతో కలకలం

     అవినీతి రహిత సమాజాన్ని ఆశిస్తున్నట్లుగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. జయకు జైలు జీవితం ఖాయమనే ఊహాగానాలు బయలుదేరగా, ప్రతిపక్షాలు సంబరం చేసుకుంటున్నాయి. భవానీసింగ్‌పై తీర్పు నిజాయితీకి, న్యాయానికి కలిగిన విజయమని డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. నిందితులుగా నిర్ధారణ అయిన వారే తమకు అనుకూలమైన వ్యక్తిని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించుకోవడం ఈ కేసు విచారణలో వినోదమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ అన్నారు. అందుకే కోర్టు సరైన తీర్పును వెల్లడించిందని వ్యాఖ్యానించారు. జయ ఆస్తుల కేసు పునర్విచార ణ సాగాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ.రామకృష్ణన్ కోరారు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top