ఇంత నిర్లక్ష్యమా?

ఇంత నిర్లక్ష్యమా? - Sakshi


హైకోర్టు జడ్జీల నియామకాల్లో జాప్యంపై సుప్రీం ఆగ్రహం

న్యాయవ్యవస్థను స్తంభింపచేయలేరంటూ కేంద్రానికి చురకలు

ఇది అహానికి సంబంధించిన అంశం కాదన్న సీజేఐ ధర్మాసనం


 న్యూఢిల్లీ: హైకోర్టులకు జడ్జీల నియామకాల్లోకేంద్ర ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జీల్ని నియమించకుండా ప్రభుత్వం న్యాయవ్యవస్థను స్తంభింపచేయలేదంటూ శుక్రవారం ఘాటుగా వ్యా ఖ్యానించింది. చాలా కాలం క్రితమే సుప్రీం కోర్టు కొలీజియంకు సిఫార్సులు పంపినా నిర్లక్ష్యం ఎందుకని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నిలదీసింది. అవసరమైతే న్యాయశాఖ, పీఎంఓ సిబ్బందిని కోర్టుకు రప్పిస్తామని, ఐదుగురు జడ్జీల బెంచ్‌కు  కేసును బదిలీ చేస్తామంటూ హెచ్చరించింది.


‘కొలీజీయం సిఫార్సుల్లో ఏదైనా వ్యక్తి పేరుపై అభ్యంతరాలుంటే... పునఃపరిశీలన కోసం  వెనక్కి పంపాలి... అంతేకానీ నియమకాల్ని కేంద్రం అడ్డుకోలేదు’ అని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావుల బెంచ్ పేర్కొంది. కర్ణాటక హైకోర్టులో కోర్టు గదులున్న ఒక అంతస్తుకు తాళం వేయడాన్ని ఉదహరించింది. ‘కోర్టు గదులు మూతపడుతున్నాయి. మీరు న్యాయవ్యవస్థ మూతపడాలని కోరుకుంటున్నారా’ అని ప్రశ్నించింది. 


 77లో 18 పేర్లకే కేంద్రం ఆమోదం..: నియామకాలకు సంబంధించి మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ) ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఆలస్యమవుతోందని, ఇటీవలి సుప్రీం తీర్పు నేపథ్యంలో అది తప్పనిసరంటూ రోహత్గీ వాదించగా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నియామకాలకు ఎంఓపీ ఖరారు అడ్డంకి కాకూడదనే పాత ఎంఓపీ మేరకు నియామకాలు జరపమని న్యాయశాఖను అనుమతించిన విషయం గుర్తు చేసింది. ‘నియామకాల్లో ప్రతిష్టంభన ఉండకూడదు. కొత్త ఎంఓపీ ఖరారు కాకపోయినా నియామక ప్రక్రియ కొనసాగేందుకు మీరొప్పుకున్నారు. పాత ఎంఓపీ ప్రకారం నియామకాలు జరుపుతామని చెప్పారు’ అని  గుర్తుచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన 77 పేర్లలో 18 మాత్రమే ఆమోదం పొందాయని అసంతృప్తిప్రకటించింది.


‘9 నెలలుగా కొలీజియం మీకు పేర్లిస్తూనే ఉంది, పక్కన పెడుతూనే ఉన్నారు. దేని కోసం ఎదురుచూస్తున్నారు? వ్యవస్థలో మార్పు కావాలా? కొన్ని విప్లవాత్మక మార్పులు అవసరమా?’ అని ప్రశ్నించింది. కార్యనిర్వాహక వ్యవస్థ నిర్లిప్తతతో న్యాయవ్యవస్థ నిర్వీర్యం అవుతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాలకు 18 పేర్లను సూచిస్తే.. కేవలం 8 పేర్లే ఎంపిక చేశారు, ఇప్పుడు ఇద్దర్నే నియమించమంటున్నారు.


ఫిబ్రవరి 4నే ఫైళ్లను కేంద్రానికి పంపాం. పురోగతి ఏంటో చెప్పండి? న్యాయశాఖ, పీఎంఓ అధికారుల్ని మా ముందు హాజరుకమ్మని ఆదేశించగలం. మీరే వారిని పిలవండి, వారు చెప్పేది మేం వినాలనుకుంటున్నాం’ అని ఏజీని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఎన్‌జేఏసీ(నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్)పై సుప్రీం తీర్పు ప్రకారం తాజా ఎంఓపీ తప్పనిసరని రోహత్గీ పేర్కొన్నారు. 


పోట్లాడుకునే పరిస్థితి వద్దు: సుప్రీం

అనంతరం శాంతించిన  బెంచ్ ‘ఇది వ్యక్తిగత విషయం కాదు. వ్యవస్థకు సంబంధించింది. వ్యవస్థలు పోట్లాడుకునే పరిస్థితి మేం కోరడం లేదు. ఇది ఎవరి అహానికీ సంబంధించిన విషయం కాదు ’ అని పేర్కొంది. న్యాయవ్యవస్థను పరిరక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 60 శాతం కంటే తక్కువ సిబ్బందితో హైకోర్టులు పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా న్యాయవాది మాథ్యూస్ నెడుంపరా జోక్యానికి ప్రయత్నించగా .. ‘మీరు కేవలం విను.


లేదంటే కోర్టు గది బయటకు పంపిస్తాను’ అంటూ సీజేఐ మండిపడ్డారు. పోలీసుల్ని పిలవాలంటూ కోర్టు గుమస్తాను ఆదేశించడంతో   న్యాయవాది మిన్నకుండిపోయారు. నియమకాల్లో పురోగతి ఉండాలని ఆదేశించిన బెంచ్ విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది.  కాగా, కొత్త జడ్జీల నియామకంపై ఆసక్తితో ఉన్నామని, అయితే కొలీజియం ముందు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఎంఓపీపై నిర్ణయం వేగవంతం చేయాలని కేంద్రం తెలిపింది.. హైకోర్టుల్లో తాజా 86 మంది జడ్జీలతోపాటు 121 మంది అదనపు జడ్జీల్ని  శాశ్వత జడ్జీలుగా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top