ఆమంచిపై ఆగ్రహ జ్వాలలు

ఆమంచిపై ఆగ్రహ జ్వాలలు

  • జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై దాడికి వ్యతిరేకంగా సర్వత్రా నిరసనలు

  • దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్షాలు

  • ఒంగోలు : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కుటుంబ సభ్యులు ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై దాడి చేయడాన్ని జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే కుటుంబం పట్టపగలే ఏకంగా చీరాల పోలీస్‌స్టేషన్‌ ఎదుటే జర్నలిస్టుపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నివర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. దాడి ఘటనపై పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఖండనలు వెలువడ్డాయి. అసభ్య ఆరోపణలు చేశారనుకుంటే ప్రజాస్వామ్యపద్ధతిలో ఎదుర్కొనే అవకాశం ఉందని, న్యాయస్థానానికి వెళ్లవచ్చని, వాటిని పక్కనపెట్టి ఏకంగా భౌతికదాడులకు దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి ఘటనను ఖండిస్తూ ఒంగోలులో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ఆందోళన నిర్వహించింది.



    యూనియన్‌ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి బ్రహ్మం నేతృత్వంలో జర్నలిస్టులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం డీఆర్‌ఓ ప్రభాకరరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుపై దాడిచేసిన వారిని తక్షణం అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు జాప్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు డీఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించారు. దాడులను ఖండించారు. కనిగిరిలో ప్రింట్‌ మీడియా జర్నలిస్టు యూనియన్‌ ఆధ్వర్యంలో అన్ని పత్రికల జర్నలిస్టులు ఆందోళనలు నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ద్వారా నిరసనలు తెలిపారు. ఆ తర్వాత తహసీల్దార్, సీఐలకు వినతిపత్రం సమర్పించారు. పీసీ పల్లిలోనూ స్థానిక జర్నలిస్టులు దాడి ఘటనను ఖండిస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.



    పొదిలి తాలూకా ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు స్థానిక ఆర్‌అండ్‌బీ నుంచి ఎంఆర్‌ఓ ఆఫీస్‌ వరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పాత బస్టాండ్‌ వద్ద మానవహారం నిర్వహించారు. తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. చీరాలలో సీపీఐ నేతలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టుపై దాడి ఘటనను ఖండించారు. జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై దాడి చేసిన ఆమంచి స్వాములు, మిగిలిన వర్గాలను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  



    ఆమంచి స్వాములును అరెస్టు చేయాలి   

    ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌

    చీరాల రూరల్‌ : నాగార్జునరెడ్డిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు శ్రీనివాసరావు (స్వాములు), అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్‌ధర్మా, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ బాబు డిమాండ్‌ చేశారు. నాగార్జున రెడ్డిపై దాడిజరిగి 24 గంటలు గడిచినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదో అర్థం కావడంలేదన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులకు తెగపడటం ఎంతవరకు సమంజసమన్నారు.


    రాజ్యాంగంలో ప్రతిఒక్కరికీ వాక్‌స్వాతంత్య్రం ఉందన్నారు. నియోజకవర్గానికి బాధ్యత వహించే ఎమ్మెల్యే.. రాజ్యాంగానికి లోబడి పాలన చేయాలేగానీ ఇష్టానుసారం వ్యవహరించరాదన్నారు. నిజాలను నిర్భయంగా ప్రచురించే జర్నలిస్టులకే రక్షణ లేకపోతే..సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందన్నారు. దాడిని అపలేకపోయిన పోలీసులపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమంచి శ్రీనివాసరావు, అతని అనుచరులను అరెస్టు చేయని పక్షంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top