సభ్యత్వం తీసుకోండి


- రుసుము మేమే భరిస్తాం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

 

బెంగళూరు: దారిద్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాల్లో కనీసం ఒక్కరైనా ఏదో ఒక  సహకార సంఘంలో సభ్యులుగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇందుకు సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్పించడానికి అయ్యే సభ్యత్వ లేదా షేర్ రుసుం ప్రభుత్వమే భరించనుందన్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో త్వరలో అధికారిక ప్రకటన వెలువరించనున్నామని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో నూతనంగా నిర్మించబడనున్న ‘సహకార సౌధ’ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. సహకార సంఘాల్లోని సభ్యులందరికీ ఆరోగ్యబీమా కోసం అమలు చేస్తున్న ‘యశస్విని పథకం’ ఎంతో ప్రయోజనకంగా ఉంటోందన్నారు.



ఈ పథకం రాష్ట్రంలోని అన్ని బీపీఎల్ కుటుంబాలకు కూడా అందాలనేది తమ ఉద్దేశమన్నారు. అందువల్లే బీపీఎల్ కుటుంబంలో కనీసం ఒక్కరినైనా సహకార సంఘ సభ్యుడిగా చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని దాదాపు 1.08 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని సిద్ధరామయ్య వివరించారు. ఒక్క యశస్వినీ పథకమే కాకుండా సహకార సంఘాల్లోని ప్రతి సభ్యుడికీ రూ.3 లక్షల వరకూ వడ్డీరహిత రుణాలు అం దిస్తున్నామన్నారు. ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు కూడా నూతనంగా చేరబో యే సభ్యులకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 వేల సహకార సంఘాలు, 2.22 కోట్ల సహకారసంఘ సభ్యులు ఉన్నారని సిద్ధరామ య్య తెలిపారు. ప్రభుత్వ నూతన నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కూడా ప్రయోజనం పొందగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సహకార శాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవ ప్రసాద్ మాట్లాడుతూ... నూతననంగా చేపడుతున్న సహకారసౌధ భవన నిర్మాణానికి రూ.8.60 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. ఏడాదిన్నరలోపు భవనాన్ని పూర్తి చేస్తామని తె లిపారు. మంత్రులు రామలింగారెడ్డి, దినేశ్‌గుండూరావ్ పాల్గొన్నారు.  

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top