పటిష్ట భద్రత


ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో పటిష్ట భద్రత నిమిత్తం పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఆదివారం ఓ బృందం చెన్నైకు చేరుకుంది. వీరిని తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం జిల్లాలకు పంపించారు. బూత్ స్లిప్పుల పంపిణీ ముగియడంతో, ఓటుకు నోటు అడ్డుకట్టే లక్ష్యంగా గస్తీకి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాల తనిఖీల్లో రూ.పది కోట్లు పట్టుబడ్డాయి.

 

 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల తేదీ సమీపించింది. ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో నగదు బట్వాడా అడ్డుకట్టే లక్ష్యంగా, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ బందోబస్తును పెంచారు. రాష్ట్రం లోని పోలింగ్ బూత్‌లలో 9,226 సమస్యాత్మకంగా గుర్తించారు. ఇందులో 1337 కేంద్రాలు అత్యంత సమస్యత్మాకమైనవిగా తేల్చారు. ఈ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. రంగంలోకి పారా మిలటరీ బలగాలను దించారు.

 

 నగదు రవాణా అడ్డుకట్టే లక్ష్యం: రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక పోలీసులు, పక్క రాష్ట్రాల ప్రత్యేక పోలీసు బృందాలు విధుల్లో నిమగ్నమయ్యూయి. ఎన్నికల్లో నగదు రవాణా అడ్డుకట్ట లక్ష్యంగా చేసుకుని తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటి వరకు సుమారు రూ.37 కోట్లకు పైగా నగదు, వస్తువులు లెక్కలోకి రానివి పట్టుబడి ఉన్నాయి. ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి రాజకీయ పక్షాలు సిద్ధమవుతుండడాన్ని పసిగట్టిన ఎన్నికల యంత్రాంగం పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించింది. రాష్ట్రంలో భద్రతా విధుల నిమిత్తం 32 కంపెనీలకు చెందిన 3200 మంది పారా మిలటరీ సిబ్బందిని ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశారు. ఈ బృందాలు పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నాయి. శనివారం రాత్రి రెండు కంపెనీల బృందాలు ఇక్కడికి చేరుకోగా, ఆదివారం మరో మూడు కంపెనీల బృందాలు చెన్నైకు వచ్చాయి. ఎగ్మూర్, సెంట్రల్ రైల్వే స్టేషన్లకు చేరుకున్న ఈ బృందాలను భద్రతా విధుల నిమిత్తం విల్లుపురం,

 

 తిరువళ్లూరు, కాంచీపురం వేలూరు, అరక్కోణం లోక్ సభ నియోజకవర్గాలకు పంపించారు. మరి కొన్ని బృందాలు నేరుగా తిరుచ్చి, కోయంబత్తూరు, తిరునల్వేలికి చేరుకున్నాయి. సోమవారం సాయంత్రంలోపు 32 కంపెనీలకు చెందిన పారా మిలిటరీ రాష్ట్రంలోని ఆయా లోక్‌సభ నియోజకవర్గాలకు చేరనున్నది. 1337 అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతను పూర్తి స్థాయిలో పారా మిలటరీ పర్యవేక్షించనున్నది.  ప్రత్యేక బృందాలు : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రత్యేక బృందాలు ఆదివారం ఉదయం నుంచి రంగంలోకి దిగాయి. ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో సంబంధం లేకుండా ఈ ప్రత్యేక బృందాలు విధుల్లోకి దిగాయి.

 

 ప్రతి పది కేంద్రాలను మండలంగా ఏర్పాటు చేసి, 5,360 బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందంలో ఒక అధికారి, ఒక సహాయ అధికారి, ఐదుగురు పోలీసులు ఉన్నారు. ఎన్నికలయ్యే వరకు ఈ బృందాలు గస్తీలోనే ఉంటాయి.  ఎక్కడైనా నగదు బట్వాడా జరుగుతున్నట్టు తెలిస్తే, వారిని అరెస్టు చేసే అధికారం ఈ బృందాలకు ఉంటుంది.రూ. పది కోట్లు పట్టి వేత: ఎన్నికల విధుల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో రూ.పది కోట్ల మేరకు నగదు, బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. తిరుప్పూర్ అవినాశి రోడ్డులో తనిఖీల్లో ఉన్న ఓ ప్రత్యేక బృందం ఓ కారును తనిఖీ చేసింది. అందులో రూ. వెయి, 500 నోట్ల కట్టలు కనిపించాయి. అయితే, ఆ నగదు ఏటీఎంలో అమర్చేందుకు తీసుకె ళుతున్నట్టు డ్రైవర్ ఇసక్కి రాజ్ పేర్కొనడంతో అనుమానం వచ్చి లెక్కించారు. డ్రైవర్ 98 లక్షలు ఉన్నట్టు పేర్కొనగా, అధికారుల లెక్కల్లో రూ.కోటి తొమ్మిది లక్షలు ఉన్నట్టు తేలింది. దీంతో నగదును సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు.

 

 తిరునల్వేలి సమీపంలోని ఓ కారులో తనిఖీలు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకుంది. 30 కిలోల ఆ బంగారు బిస్కెట్ల ధరను రూ.8.5కోట్లుగా నిర్ధారించారు. అయితే, ఈ బిస్కెట్లు మదురై, నాగుర్ కోయిల్‌లలోని అతి పెద్ద నగల షోరూంకు చెందినవిగా, వీటికి సంబంధించిన అన్ని రికార్డులు ఉన్నట్టు ఆ వాహనంలోని సిబ్బంది పేర్కొన్నా, పోలీసులు మాత్రం విచారణకు నిర్ణయించారు. ఇక, తిరునల్లారు శనీశ్వర ఆలయ దర్శనం ముగించుకుని ఓ కుటుంబం కారులో తేనికి వెళ్తోండగా, ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డగించింది. ఆ కారును తనిఖీ చేయగా అందులో రూ.లక్ష బయట పడింది. అయితే, తాను ఈ లక్ష ఏటీఎంలు తీశానని ఆ కారులో ఉన్న వ్యక్తి పేర్కొన్నా, పోలీసులు ఖాతరు చేయలేదు. చివరకు విచారణలో ఆ వ్యక్తి రాష్ట్ర మంత్రి ఓ పన్నీరు సెల్వం సహాయకుడిగా తేలింది. ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు.

 

 ముగిసిన బూత్ స్లిప్పుల పంపిణీ: ఓటర్లకు ఎన్నికల యంత్రాంగం బూత్‌స్లిప్పులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీని ఆధారంగా నేరుగా పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ బూత్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియను ఆదివారంతో ముగించేశారు. ఎవరైనా స్లిప్పులు పొందని పక్షంలో, ఆయా పరిధిలోని తాలుకా కార్యాలయాలు, ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల రోజు వరకు వెళ్లి స్వీకరించ వచ్చని ఈసీ పేర్కొంది. ఎన్నికల తేదీ సమీపించడంతో ఈవీఎంలలో ఆయా పార్టీల చిహ్నాలు, అభ్యర్థుల పేర్లు పొందు పరిచే ప్రక్రియ వేగవంతం అయింది. మంగళవారం సాయంత్రంలోపు ఈ ప్రక్రియను ముగించనున్నారు. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ప్రతినిధుల సమక్షంలో వీటిని పొందు పరుస్తున్నారు.  

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top