ఈ-రిక్షాలకు బ్రేక్


 సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఎలక్ట్రానిక్ రిక్షా (ఈ-రిక్షా)లపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. రాజధాని రోడ్లపై ఆగస్టు 14 వరకు ఈ-రిక్షాలను తిరగ నివ్వకూడదని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వాహనాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) విచారణ జరుపుతున్న హైకోర్టు బెంచ్ పైనిర్ణయం తీసుకుంది. ఈ-రిక్షాలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని, వాటి వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ కేసుపై ఆగస్టు 14న తిరిగి విచారణ జరిపిన తరువాతే న్యాయస్థానం తుదినిర్ణయం తీసుకోనుంది. ఈ-రిక్షాలు నియమనిబంధనలు లేకుండా నడుస్తున్నాయని, వీటిని వెంటనే నిషేధించాలన్న ప్రభుత్వం, పిటిషనర్ వాదనతో న్యాయమూర్తులు బీడీ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. వీటి నియంత్రణకు చట్టం చేసేంత వరకు వీటి సంచారాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఈ-రిక్షా డ్రైవర్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని అనుమతించరాదని పేర్కొంది. నగర రోడ్లపై ఈ-రిక్షాలు నడవకుండా ఉండేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని  ఆదేశించింది.

 

 ఈ కేసు గురువారం విచారణ సందర్భంగా కాసేపు వాదోపవాదాలు జరిగాయి. ఢిల్లీలో ఈ-రి క్షాలు అక్రమంగా నడుస్తున్నాయని, ఇవి నిబంధనలను పాటించడం లేదని పిల్ దాఖలు చేసిన వ్యక్తి తరఫు న్యాయవాది సుగ్రీవ్ దూబే న్యాయస్థానానికి తెలిపారు. వీటిని మోటారు వాహనాల చట్టం పరిధి నుంచి మినహాయించడానికి  చట్టాన్ని సవరించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ రాసిన లేఖను ప్రభుత్వం తరపు న్యాయవాది జుబేదా బేగం న్యాయస్థానానికి సమర్పించారు. స్థానిక సం స్థలు ఈ-రిక్షాలను నియంత్రించేందుకు నిబంధన లు రూపొందిస్తాయని పేర్కొంటూ మంత్రిత్వశాఖ రాసిన లేఖ ప్రతిని ఆమె సమర్పించారు. అయితే వీటి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న చర్యలపై న్యాయస్థానం స్పందించడానికి నిరాకరిం చింది. ప్రస్తుతం ఈ-రిక్షాలను నడపడం అక్రమమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

 

 తిలోక్‌పురిలో రెండురోజుల   కింద ఈ-రిక్షా ఢీకొనడంతో తల్లి ఒడిలో నుంచి జారిపడిన బాలుడు చక్కెరపాకంలో పడి మరణి ంచడాన్ని కూడా న్యాయస్థానం పరిగ ణనలోకి తీసుకుంది. ఈ వాహనాల్లో ఎంత బరువు తీసుకెళ్లాలి, ఎంత మంది ప్రయాణికులను కూర్చోబెట్టుకోవాలి అనే వాటిపై నిర్దిష్టమైన ఆదేశాలు లేవని, కనీసం రిజిస్ట్రేషన్, బీమా లేదని న్యాయస్థానం ఆక్షేపించింది. తగిన నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా నడిచే ఈ-రిక్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, వీటి వల్ల ఇది వరకే 29కిపైగా రోడ్డు దుర్ఘటనలు జరిగాయని ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు విన్నవించారు. బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలపై డ్రైవర్లకు తగిన నియంత్రణ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలను కలిగిస్తూ తోటి ప్రయాణికులకు తరచూ ఇబ్బంది కలిగిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. వీటిని నడిపే డ్రైవర్ల వివరాలను కూడా పరిశీలించే విధానం లేదని వివరించారు.

 

 డ్రైవరు సహా నలుగురు మాత్రమే కూర్చుని ప్రయాణించేలా ఈ-రిక్షాలను డిజైన్ చేసినప్పటికీ వాటిలో ఎనమిది మందిని కూర్చోబెట్టి నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటితో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నందున నిషేధించాలని షానవాజ్ ఖాన్ అనే సామాజిక కార్యకర్త ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్ రిక్షాలపై (ఈ-రిక్షా) నిషేధం విధించబోమని, మరింత అభివృద్ధి చేస్తామని  నితిన్ గడ్కరీ గత నెల 17న రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించడం తెలిసిందే. ఈ-రిక్షా డ్రైవర్లు, యజమానులు నిర్వహించిన మహార్యాలీలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. 650 వాట్ల బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలకు లెసైన్సులు అవసరం లేదని, వాటిలో నలుగురు ప్రయాణికులను, 50 కిలోల సామానును తీసుకువెళ్లవచ్చని గడ్కరీ చెప్పారు. ఈ-రిక్షాల రిజిస్ట్రేషన్ల్ కోసం డ్రైవర్లు, యజమానులు ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్‌టీఓ) కార్యాలయానికి వెళ్లనవసరం లేదని నితిన్ గడ్కరీ చెప్పారు.

 

 వంద రూపాయల ఖర్చుతో ఎమ్సీడీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-రిక్షా డ్రైవర్లకు గుర్తింపుకార్డు లభిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ-రిక్షా పేరును ఇక మీదట దీన్ దయాళ్ ఈ-రిక్షాగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్ దయాళ్ ఈ-రిక్షా పథకం కింద రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. అయితే, హైకోర్టు తీర్పుతో బీజేపీ కొంత ఇరకాటంలో పడినట్ల య్యింది. ఇప్పుడు కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకు వస్తే తప్ప  ఈ రిక్షాల మనుగడ కష్టసాధ్యమని వాటి యజమానులు అంటున్నారు. కాగా, ఈ -రిక్షా డ్రైవర్ల బాగుకోసం బీజేపీ నాయకత్వం చేసిందేమీ లేదని ఆప్ ఆరోపించింది. ప్రస్తుత కోర్టు ఆదేశంతో రోడ్డున పడబోతున్న డ్రైవర్ల బాధ్యత బీజేపీదేనని ఆప్ నాయకులు హెచ్చరించారు.త

 

 బీజేపీదే బాధ్యత: డీపీసీసీ విమర్శ

 నగరంలో ఈ - రిక్షాలపై హైకోర్టు నిషేధం విషయంలో బీజేపీదే బాధ్యత అని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. నగర రోడ్లపై ఈ రిక్షాలు తిరగకూడదని గురువారం ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. కాగా, దీనిపై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ రిక్షాలపై హైకోర్టు నిషేధం విధించడంలో బీజేపీదే బాధ్యత అని ఆరోపించారు. ఒకవేళ నగరంలో ఈ రిక్షాలను శాశ్వతంగా నిషేధిస్తే సుమారు పది లక్షలమంది రోడ్డున పడతారని ఆయన అన్నారు. ఈ-రిక్షాలకు రక్షణ కల్పిస్తామని కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని, ఈ మేరకు నగరంలో ఆర్భాటంగా పోస్టర్లు కూడా అతికించారన్నారు. నిజానికి బీజీపీ, ఆప్‌లు ఈ-రిక్షాలకు వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. ఆటో డ్రైవర్లతో ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ సమావేశం ఒక నాటకమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ విమర్శించారు. ఆటోరిక్షా డ్రైవర్లలో ఎక్కువ మంది ఈ కేజ్రీవాల్ ర్యాలీకి దూరంగా ఉన్నారని ఆయన అన్నారు. రాష్ర్ట కాంగ్రెస్ నాయకుల బృందం గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ నవాబ్ జంగ్‌ను కలిసి ఈ-రిక్షా డ్రైవర్లకు అనుకూలంగా ఆర్డినెన్స్ తేవాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top