‘హరికృష్ణ ఎక్స్‌పోర్‌‌స్ట’పై చర్యలేవీ?


- పోలీసులు పట్టించుకోలేదు.. కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు

- ఆరోపించిన మాజీ మంత్రి నసీమ్ ఖాన్

- రెండు రోజుల్లో యజమానిని అరెస్టు చేయకపోతే నిరసన చేస్తామని వెల్లడి

ముంబై:
మతం పేరుతో ముస్లిం యువకుడికి ఉద్యోగమివ్వని వజ్రాభరణాల ఎగుమతి చేసే హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర మాజీ మంత్రి నసీమ్ ఖాన్ ఆరోపించారు. ఘటన జరిగి నాలుగు రోజు లైనా సదరు సంస్థపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. మరో రెండు మూడు రోజుల్లో అరెస్టు చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని ప్రభుత్వాన్ని ఆదివారం హెచ్చరించారు.



హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ జేషన్ అలీ ఖాన్ ఉద్యోగానికి దర ఖాస్తు చేసుకున్నాడు. దానికి ‘మీ దరఖాస్తుకు ధన్యవాదాలు. మేము ముస్లిమేతర అభ్యర్థులను మాత్రమే ఉద్యోగంలో చేర్చుకుంటాం’ అని కంపెనీ జవాబు పంపింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని బీకేసీ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్, ఆ జోన్ డీసీపీని కోరినట్లు ఖాన్ చెప్పారు. అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాలని ఆయన కోరారు. ఆదివారం ఉదయం జేషన్, అతని తండ్రితో కలసి ఖాన్‌ను కలిశారు. పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని, కేసును పరిశీలించాలని కోరారు.



ప్రస్తుతం జరుగుతున్న విచారణపై అసంతృప్తి లేదని, అయితే కేసుకు సంబంధించి అరెస్టు జరిగి ఉంటే సంతోషించే వాడినని జేషన్ అన్నారు. ఈ విషయమై బీకేసీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కే నిగ్డే మాట్లాడుతూ.. కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని, దానికి అనుగుణంగా అరెస్టు జరుగుతుందని అన్నారు. మే 21న ఈ విషయం తెలిసిన తర్వాత సీఎం ఫడ్నవీస్ ఘటనపై విచారణకు ఆదేశించారు. ముంబై పోలీసులు ఆ బిజినెస్ హౌజ్‌పై కేసు నమోదు చేశారు. జాతీయ మైనార్టీ కమిషన్ ఆ బిజినెస్ హౌజ్ నుంచి వివరణ కోరింది. అయితే ఇది హెచ్‌ఆర్ ట్రెయినీ తప్పిదమని, సదరు వ్యక్తిపై చర్య తీసుకున్నామని కంపెనీ తెలిపింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top