మదన్ ఉచ్చులో పచ్చముత్తు

మదన్ ఉచ్చులో పచ్చముత్తు - Sakshi


మెడికల్ సీట్లపై రూ.72 కోట్ల మోసం ఆరోపణ

 ఎస్‌ఆర్‌ఎం చాన్స్‌లర్  పచ్చముత్తు అరెస్ట్

 15 రోజుల రిమాండ్


 

 సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ఇంజినీరింగ్, మెడికల్ తదితర అనేక ఉన్నత విద్యాబోధనలో ఎంతో పేరుగాంచింది. ఇంజినీరింగ్ కంటే వైద్యవిద్యకు ఎక్కువ గిరాకీ ఉండడంతో సీట్లకు అదేస్థాయి రేటు పలుకుతోంది. పచ్చముత్తుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా చెప్పబడుతున్న వేందర్ మూవీస్ అధినేత మదన్ ఈ ఏడాది మేలో అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వైద్యవిద్యార్థుల అడ్మిషన్‌లో మదన్, పచ్చముత్తుల మధ్య అనేక లావాదేవీలు ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల నుంచి తాను వసూలు చేసిన సొమ్ము మొత్తాన్ని పచ్చముత్తుకు అప్పగించానని, విద్యార్థుల విషయంలో ఆయనదే బాధ్యత, తాను కాశీకి వెళ్లి సమాధి అవుతున్నానని మదన్ తన గదిలో ఒక ఉత్తరాన్ని వదిలి వెళ్లాడు.

 

 దీంతో వైద్యసీట్ల పేరుతో కోట్లాది రూపాయలు కాజేశారని పచ్చముత్తుపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. దీంతో మదన్ ఎక్కడున్నాడో కనుగొని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మెడికల్ సీట్ల పేరున విద్యార్థుల నుంచి ఎస్‌ఆర్‌ఎంవారు భారీగా వసూలు చేశారని మదన్ తల్లి తంగం హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఇంత వరకు 112 మంది నుంచి రూ.72 కోట్లకు పైగా వసూలు చేశారని, మరికొందరు విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

 

 మిగిలిన ఫిర్యాదులు కూడా అందితే మోసం సొమ్ము రూ.వందకోట్లు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యార్థుల నుంచి సొమ్ము వసూలు చేసింది మదనే అయినా వర్సిటీ చాన్సలర్‌గా పచ్చముత్తునే బాధ్యత వహించాలని బాధిత తల్లిదండ్రులు పోలీసుల వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా మదన్ ఆచూకీ, ఆరోపణలపై నిజాలు వెలికితీసేందుకు సెంట్రల్ క్రైంబ్రాంచ్  అదనపు సహాయ కమిషనర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు తమ నివేదికను కోర్టులో దాఖలు చేస్తున్నారు. ఈనెల 17వ తేదీన దాఖలు చేసిన నివేదిక ను పరిశీలించిన న్యాయమూర్తులు పోలీసుల పనితీరును తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలుస్తోంది. విచారణ చేతకాకుంటే మరొకరికి అప్పగిస్తామని హెచ్చరించడంతోపాటు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ చాన్స్‌లర్ పచ్చముత్తు, ఇతర నిర్వాహకులను విచారించక పోవడంపై నిలదీసినట్లు తెలిసింది.

 

  విద్యార్థుల నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వకుంటే ఆత్మాహుతికి పాల్పడుతామని తల్లిదండ్రులు పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. మదన్ ఆచూకీ తెలియకపోవడంతో విచారణకు నేరుగా హాజరుకావాలని పచ్చముత్తుకు పోలీసులు సమన్లు జారీ చే శారు. దీంతో గురువారం సాయంత్రం 6 గంటలకు పచ్చముత్తు పోలీసుల ముందు హాజరైనారు. పచ్చముత్తును ప్రత్యేక గదిలో ఉంచి పెద్ద సంఖ్యలోని పోలీసుల బృందం విచారణ జరిపింది. శుక్రవారం ఉదయం కూడా విచారణ కొనసాగిన నేపథ్యంలో పచ్చముత్తును అరెస్ట్ చేయనున్నట్లు మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ప్రకటించారు. రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి సైదాపేట 11వ మెజిస్ట్రేటు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పచ్చముత్తును పుళల్ జైలుకు తరలించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top