క్రీడలు మహిళలకు వరం


న్యూఢిల్లీ : క్రీడలు మహిళలను మానసికంగా దృఢంగా చేస్తాయని అంతర్జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారిణి జగ్మతి సంగ్వాన్ అన్నారు. ‘ఢిల్లీలో మహిళలు, క్రీడలు’ అన్న అంశంపై ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ‘‘మహిళాసాధికారతలో క్రీడలు కీలక భూమిక పోషిస్తాయి, వ్యక్తిగత గుర్తింపునివ్వడమే కాదు... ఆత్మవిశ్వాసం పెరగడానికీ దోహదం చేస్తాయి’’ అని అభిప్రాయపడ్డారు జగ్మతి.



 54 ఏళ్ల జగ్మతి మాజీ క్రీడాకారిణే కాదు... సామాజిక కార్యక్రమాల్లోనూ క్రియాశీలకంగా ఉంటారు. మహిళలు క్రీడారంగంలోకి రావడం ద్వారా వారి వ్యక్తిత్వంలో మార్పు రావడమే కాదు... సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు కూడా తగ్గుతాయన్నారామె. మహిళల పట్ల వివక్ష ఎక్కువగా ఉందని, తమ పిల్లలు చదువుకుని ఏదో ఓ ఉద్యోగంలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులే కాదు... క్రీడాధికారులు సైతం మహిళా క్రీడాకారులపై సవతితల్లి ప్రేమ చూపుతారని ఆమె ఆరోపించారు.



మరోవైపు ఎంత వివక్ష చూపినా, సవతితల్లి ప్రేమ ప్రదర్శించినా, మౌలిక సదుపాయాలు లేకపోయినా, అభద్రత ఉన్నా, క్రికెట్ తప్ప మిగిలినవన్నీ అసలు ఆటలే కాదన్నట్టుగా చూసినా... అన్నింటినీ అధిగమిస్తూ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి రస్‌ప్రీత్ సింధు, షూటర్ శ్రీయాంక సదంగి ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో తమ ప్రతిభ కనబరిచారు. ‘‘ఎందుకు అంతర్జాతీయ పోటీల్లో తరచూ ఓడిపోతుంటారు? అని ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు.



 కానీ విదేశాల్లో క్రీడలకోసం, క్రీడాకారుల కోసం అక్కడి ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటి? అని వారికి ఎలా చెప్పగలం’’ అంటున్నారు అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి సింధు. ‘‘క్రీడాకారులకు కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి?ఉద్యోగం పరిస్థితి ఏమిటి? అనే ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడేవాళ్లకు మాత్రం గెలుపు మీదే లక్ష్యం ఉంటుంది. అందుకు కారణం ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యతే’’ అన్నారామె.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top