వేగం కన్న.. ప్రాణం మిన్న..


 న్యూఢిల్లీ: వాహనాల అతివేగం ప్రాణాలు హరిస్తోంది. గాల్లో వెళ్తుండగానే.. క్షణాల్లో ప్రమాదం జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగంతో మోటారుసైకిళ్లు, వాహనాలు నడపడం వల్ల రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. వేగం కారణంగా జరిగే ప్రమాదాలతో యువకుల భవిష్యత్ అంధకారంగా మారుతోంది. కుటుంబాల్లో విషాదం మిగుల్చుతోంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం.. వేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రవాణా శాఖ రూపొందించిన సూచనలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. ఎవరి గమ్య స్థానాలకు వారు సురక్షితంగా చేరుకోవచ్చు. డ్రైవింగ్ చేసే సమయంలో వేగంకన్న ప్రాణమే మిన్న సూత్రాన్ని మదిలో ఉంచుకుంటే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు.

 

 సూచనలు..

 గుండ్రని జంక్షన్ వద్ద వాహనాల వేగం తగ్గించాలి. ఎడమ వైపు తిరగడానికి వలయంలోని బయటలైన్‌లో వెళ్లాలి. గుండ్రని జంక్ష న్ నుంచి బయటకు రావడానికి ఎడమ వైపు సిగ్నల్ చూడాలి. జంక్షన్ నుంచి బయటకు వెళ్లే వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బ్లైండ్ స్పాట్ : వాహన చోదకుడు మిర్రర్ ముందు భాగంలో కానీ.. రివర్స్ వ్యూ మిర్రర్‌లో కానీ చూడలేని ప్రదేశాన్ని బ్లైండ్‌స్పాట్ అంటారు. ఇతర వాహనాల బ్లైండ్ స్పాట్‌లో మీ వాహనం నడుపవద్దు. అలాంటి ప్రదేశాల వద్ద మలుపు తిరుగుతున్నప్పుడు లేదా లైన్ మలుగుతున్నప్పుడు ఒక్కసారి తల తిప్పి గమనించాలి.వాహనాన్ని వెనుకకు నడపడానికి..: చిన్న రోడ్డు నుంచి మెయిన్ రోడ్డులోకి వాహనాన్ని రివర్స్ చేయవద్దు.  సాధ్యమైనంత వరకు డ్రైవర్ సీటు వైపు రివర్స్ చేయాలి. వెనుక ప్రదేశాన్ని మిర్రర్‌లో గమనించాలి.వర్షం, పొగ మంచు : వర్షం, పొగ మంచులో వాహనాన్ని నెమ్మదిగా నడపాలి. రోడ్లు స్పష్టంగా కనిపించకపోతే డిమ్‌లైట్లు ఉపయోగించాలి.

 

 దూరం పాటించాలి..

 డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి బ్రేక్ వేయడానికి కొంత సమయం పడుతుంది. దీనిని రియాక్షన్ టైం అంటారు. బ్రేక్ వేసిన తర్వాత వాహనం నిలుపడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు వాహనం కొంత ముందుకు వెళ్తుంది. వాహనం వేగం పెరిగినకొద్దీ నిలబడే దూరం పెరుగుతుంది. అందువల్ల ముందు వెళ్తున్న వాహనం నుంచి తగినంత దూరంలో ఉండాలి. రద్దీ రోడ్లపై వాహనాన్ని వేగంగా నడుపవద్దు. ముందు వెళ్లే వాహనం అకస్మాత్తుగా వేగం తగ్గించినా లేదా ఆగినా ప్రమాదం జరుగకుండా నివారించడానికి వాహనాల మధ్య కొంత దూరం పాటించాలి.వర్షం మొదలైన మొదటి అరగంట సమయంలో రోడ్డు మీద ఉన్న ఆయిల్, గ్రీస్, మట్టి వర్షం నీటితో కలిసి జారుడు ఉంటుంది. వాహనం చాలా నమ్మెదిగా నడపాలి.కల్వర్టులు, వంతెనలపై వర్షపు నీరు ప్రవహిస్తునప్పుడు వాహనాన్ని నిలిపివేతయాలి.తక్కువ లోతునీళ్లలో వాహనం నడిపేటప్పుడు లోడ్ గేర్ ఉపయోగించి ఇంజన్‌స్పీడ్ పెంచి రోడ్డుకు మధ్యలో వెళ్లాలి.

 

 రాత్రివేళల్లో డ్రైవింగ్..


 ఎదురుగా వాహనం వచ్చినప్పుడు హెడ్‌లైట్లు డిమ్ చేయాలి.ఓవర్‌టెక్ చేసేటప్పుడు హెడ్‌లైట్లు బ్రైట్, డిమ్ చేసి ముందు వాహన డ్రైవర్‌కు సంకేతం ఇవ్వాలి. హైవే రోడ్ల మీద వాహనం పార్క్ చేయరాదు.  చీకటి ప్రదేశంలో నిలిపిన, వెనుక భాగాన లైట్లు లేని వాహనాలను గమనించండి. ఒకే లైటు ఉన్న నాలుగు చక్రాల వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. వెనుక వచ్చే వాహనం ఓవర్‌టెక్ చేసేందుకు దారి ఇవ్వడానికి ఎడమ ఇండికేటర్ లైట్‌ను ఉపయోగించాలి. కుడిపక్క ఇండికేటర్ వాడరాదు.రోడ్డు మీద వాహనం నిలిపినప్పుడు పార్కింగ్ లైట్ వేయాలి. డ్రైవర్ ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి వాహనం నిలిపి విశ్రాంతి తీసుకోవాలి.

 

 ద్విచక్ర వాహనదారులు..

 వాహనం వేగం తగ్గించడానికి లేదా ఆపడానికి ముందు, వెనుక బ్రేక్ ఒకేసారి సున్నితంగా ఉపయోగించాలి.    నూనె మరకలు, నీళ్లు, ఇసుక, బురద తదితర జారుడు స్వభావం ఉన్న రోడ్లపై వాహన వేగం తగ్గించాలి. ఇలాంటి రోడ్లపై బ్రేక్ వేస్తే జారి పడే అవకాశం ఉంటుంది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top