రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధికి అడ్డు


చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో కేంద్రం ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అన్నాడీఎంకే ప్రభుత్వమే అడ్డుగా నిలిచిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కన్యాకుమారిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈలం తమిళుల సమస్యలపై భారత్ చర్చలు జరిపేందుకు తగిన స్థలం చూపాలని కేంద్రం కోరినా విపరీత జాప్యం చేశారని ఆమె విమర్శించారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు తమిళనాడులో అమలు కాకుండా సహాయ నిరాకరణ సాగించారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో బాలికా విద్య పథకానికి, ఫీజుల కోసం భారీ ఎత్తున నిధులను కేంద్రం కేటాయించిందని తెలిపారు.

 

 బాలికా శిశుసంరక్షణ పథకాన్ని పెద్ద ఎత్తున తీసుకువచ్చిందని తెలిపారు. అయితే ఈ పథకాలు సక్రమంగా అమలుకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మోకాలొడ్డిందని ఆరోపించారు. తమిళ జాలర్లు, ఈలం తమిళుల సమస్యల పరిష్కారంలో కేంద్రం ఉదాసీన వైఖరిని అవలంభించిందని కొన్ని పార్టీలు చేస్తున్న ఆరోపణలు అసత్యాలని ఆమె అన్నారు. ఈలం తమిళుల కోసం రాజీవ్‌గాంధీ తమిళనాడులోనే రక్తార్పణం చేసిన సంగతిని మరువరాదని శ్రీపెరంబదూరులో రాజీవ్‌గాంధీ హత్యోందతాన్ని గుర్తుచేశారు. మతవాద శక్తులు వస్తున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఓటర్లను హెచ్చరించారు.

 

 వివేకానందుడు ధ్యానం చేసిన కేంద్రం, కామరాజనాడార్ వంటి గొప్పనేత పాలించిన రాష్ట్రం తమిళనాడు అని కొనియాడారు. తమిళనాడును మినీ భారత్‌గా భావిస్తున్నానని అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే కన్యాకుమారి-చెన్నైల మధ్య డబుల్‌లైన్ రైల్వేమార్గం, కన్యాకుమారిలో విమానాశ్రయం, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. షెడ్యూలు ప్రకారం 11.15 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా,  మధ్యాహ్నం 12.35 గంటలకు సోనియా ప్రసంగం ప్రారంభించి  1.15 గంటలకు ముగించారు. ఁసహోదర సహోదరిగళేరూ. (సోదర సోదరీమణులారా) అంటూ తమిళంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించి ఆ తరువాత ఆంగ్లంలో కొనసాగించారు. చివరగా ఁవణక్కం, నన్రిరూ. (నమస్కారం, ధన్యవాదాలు) అని మరలా తమిళ పదాలతో ముగించారు. నటుడు కార్తీక్ సోనియా సభలో పాల్గొని ప్రసంగించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top