‘అనంత’ రాజధాని ఒట్టిమాటే

‘అనంత’ రాజధాని ఒట్టిమాటే - Sakshi

  • నగరాన్ని స్మార్ట్ సిటీగా చేసేందుకు కృషి

  •  ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

  • అనంతపురం సిటీ :‘అనంతపురం జిల్లాకు రాజధాని రాదు. వస్తుందని ఎవరైనా చెబితే అది ఒట్టిమాటే. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న కారణంగా పరిశ్రమలు భారీగా వచ్చి తీరుతాయ’ని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు గాడ్‌ఫాదర్ లాంటి వారని, ఆయన ఆశీస్సులుంటే ఏమైనా సాధించుకోవచ్చని చెప్పారు.



    గుంతకల్లును రైల్వే జోన్‌గా మార్పు చేయించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదని, అయితే వైజాగ్‌ను రైల్వే జోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. కొత్త రైళ్లు, రైల్వే స్టాపింగ్‌ల విషయంపై ఆ శాఖ మంత్రితో చర్చించానన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ‘అనంత’ను స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.  



    పుట్టపర్తి అభివృద్ధికి సీఎం హామీ ఇచ్చారని, అదే విధంగా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీరందించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వివరించారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టూరిజం అభివృద్ధికోసం గుత్తి కోటకు రూ.1.78 కోట్లు, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 3.04 కోట్లు, కొనకొండ్లలోని జంబూద్వీప చక్ర ప్రాంతానికి రూ. 1.53 కోట్లు, పెన్నహోబిలం ఆలయానికి రూ. 2.18 కోట్లు, పీఏబీఆర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూ.93 లక్షలు, సేవాఘడ్‌కు రూ. 46.33 లక్షలు, అనంతసాగర్ అభివృద్ధికి రూ. 17.27 లక్షలు, సెంట్రల్ పార్క్ అభివృద్ధికి రూ. 1.60 లక్షలు మొత్తం రూ.10.20 కోట్ల మంజూరుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు.



    కాగా జిల్లాలో వర్షాభావం కారణంగా ఇప్పటి వరకు 5శాతం విస్తీర్ణంలో కూడ విత్తనం పడలేదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఇందుకు ఆయన రైతులకు ప్రభుత్వ సహకాం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. ఇక జిల్లాలో ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడం వల్ల 99 శాతం మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top