ఇలాంటి కొడుకు మరెవరికీ వద్దు!

ఇలాంటి కొడుకు మరెవరికీ వద్దు!


అన్న తీరుపై చెల్లెళ్ల ఫిర్యాదు

 

 మల్కాపురం: కంటే కూతురునే కనాలి అన్న ఓ సినీ కవి భావం అక్షరాలా నిజమైంది. కష్టాల్లో ఉన్న తల్లిని కడచూపు చూసేందుకు మలేసియా నుంచి కూతుళ్లు కదిలారు గానీ, పక్కనే ఉన్న కొడుకు మనసు మాత్రం చలించలేదు. పైగా తల్లి, చెల్లెళ్ల ఆస్తి కాజేసేందుకు కూడా వెనకాడలేదు. వివరాల్లోకి వెళితే.. 46వ వార్డు శ్రీహరిపురం-శ్రీనివాస్‌నగర్‌లో సత్యవతి అనే వృద్థురాలు తన సొంతింట్లో నివసిస్తోంది.

 

ఆమెకు శ్రీదేవి, కనకమహాలక్ష్మి అనే కుమార్తెలతో పాటు శ్రీనివాసరావు అనే కుమారుడున్నాడు. కుమార్తెలిద్దరూ మలేసియాలో ఉంటున్నారు. శ్రీనివాసరావు స్థానికంగా తన భార్య, పిల్లలతో ఉంటున్నాడు. సత్యవతి నుంచి కొడుకు మొదటి నుంచి దూరంగానే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. కుమార్తెలే ఆమెకు నెల నెలా డబ్బు పంపించేవాళ్లు. ఆమె బాగోగులన్నీ ఇరుగుపొరుగు వాళ్లే చూసేవాళ్లు. సత్యవతి ఇంటిని ఇటీవల తన పెద్ద కుమార్తె శ్రీదేవికి రాసిచ్చేసింది.

 

ఇదిలా ఉంటే యథావిధిగానే గత శనివారం సత్యవతికి పొరుగింటివాళ్లు టీ తెచ్చారు. ఆ సమయంలో ఆమె కింద పడిపోయి ఉన్నట్టు గుర్తించడంతో కలవరం చెంది స్థానిక ఓ ప్రైవేట్ అస్పత్రికి తీసుకువెళ్లారు. ఇదే విషయాన్ని మలేసియాలో ఉంటున్న ఆమె పిల్లలకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌కు విషయం చెప్పారు.


కూతుళ్లు పట్టించుకున్నా కొడుకు పట్టించుకోలేదు. తల్లిని ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆమె ఇంటిని కూడా శ్రీనివాస్ ఆక్రమించాడని ఆమె పెద్దకుమార్తె శ్రీదేవి ఆరోపించింది. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఈనెల 26న కుమార్తెలిద్దరూ నగరానికి చేరుకుని ఆస్పత్రిలో ఉన్నా ఆమెను పరామ ర్శించారు. కాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం తో ఈ నెల 26న రాత్రి మృతిచెందింది.

 

 ఆస్పత్రి ఖర్చు లు కూడా భరించనంటూ శ్రీనివాస్ మొండికేశాడు. ఆమె అంత్యక్రియలకు కూడా ముందుకు రాలేదు. దీంతో సత్యవతి మృతదేహం రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోదరుడి తీరుపై శ్రీదేవి, కనకమహాలక్ష్మిలు పోలీసులకు ఫిర్యాదిచ్చారు. బుధవారం సత్యవతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

 

 కాగా.. ఈ ఘటన సత్యవతి ఆస్తిపై వివాదం వల్లేనని పోలీసులు గుర్తించారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా..  ఆస్తిని తనకిప్పిస్తే తక్షణం ఇల్లు ఖాళీ చేస్తానని శ్రీనివాస్ చెప్పడంపై పోలీసులూ ఆశ్చర్య పోయారు. తల్లిని సైతం కాదని ఆస్తిపైనే దృష్టి సారించడంపై స్థానికులు మండిపడుతున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top