యడ్డిపై కేసు మా పని కాదు

యడ్డిపై కేసు మా పని కాదు

► మంత్రి డీకేపై ఐటీ దాడులెవరు చేశారు?

► సీఎం సిద్ధరామయ్య 



బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పపై భూముల డీనోటిఫికేషన్‌ కేసు వ్యవహారం అధికార– విపక్షాల మధ్య అగ్గి రాజేస్తోంది. ఆ కేసు వెనుక కాంగ్రెస్‌ ప్రభుత్వ హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంటే, తమకు ఏం తెలియదని అధికార పార్టీ అంటోంది. కేసుకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ధర్నాలకు దిగాయి. 

 

సాక్షి, బెంగళూరు: భూముల డీనోటిఫికేషన్‌ కేసులో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్పపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం వెనుక తమ ప్రభుత్వం ఒత్తిడి ఉందని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవరాజ అరసు 102వ జయంతి సందర్భంగా ఆదివారం విధానసౌధ ఆవరణలోనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇళ్లు లేని పేద ప్రజల కోసం 2008లో బెంగళూరులోని యశ్వంతపుర, యలహంక హోబళిల పరిధిల్లో 3,546 ఎకరాలను సేకరించడానికి అప్పట్లో నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు.



అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలతో భూముల నోటిఫికేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. అయితే అప్పటి సీఎం యడ్యూరప్ప కొంత మంది ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రజల ఇళ్ల కోసం సేకరించిన స్థలాల్లో 257 ఎకరాలను డీనోటిఫై చేయడంతో ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దీంతో జనసామాన్యర వేదిక అధ్యక్షుడు అయ్యప్ప ఈ విషయాలన్నింటిపై ఈ ఏడాది జూన్‌ నెలలో ఏసీబీ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయాలేవి తెలియని బీజేపీ నేతలు యడ్యూరప్పపై తమ ప్రభుత్వమే ఏసీబీతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించి ఏసీబీని దుర్వినియోగపరుస్తున్నట్లు నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఏసీబీని తాము దుర్వినియోగం చేస్తున్నామని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు రాజకీయ కక్షతో తమ మంత్రి డీ.కే.శివకుమార్‌పై ఐటీ దాడులు చేయించిన కేంద్ర ప్రభుత్వ చర్యకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేదల కోసం కేటాయించిన స్థలాలను డీనోటిఫై చేసి తప్పు చేసిన యడ్యూరప్పకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేస్తుండడం విచారకరమన్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top