శివమొగ్గలో భారీ వర్షం

శివమొగ్గలో భారీ వర్షం

  • జనజీవనం అస్తవ్యస్తం

  • జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న వానలు

  • యడూరిలో 158 మిమీ వర్షం

  • శివమొగ్గ : శివమొగ్గ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకు నగరంలో భారీ వర్షం నమోదైంది. దీంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యాహ్నం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినా సాయంత్రం కుండపోత పడింది. దీంతో నగర వాసులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇళ్లలోని ఉండిపోయారు. హెలీప్యాడ్ సర్కిల్,  కువెంపు సర్కిల్, ఇతర ప్రముఖ కూడళ్లలో వరద నీరు చెరువును తలపించింది.

     

    నమోదైన వర్షం వివరాలు

     

    గడిచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమ కొండ ప్రాంతాలు ఆగుంబె 107 మిమీ,  యడూరిలో 158,  మాస్తీకట్టెలో 148,  హులికల్లు 128,  మాణిడ్యాం ప్రదేశంలో 162 మిమీ, శివమొగ్గలో 9.20,  భద్రావతిలో 47.80, తీర్థహళ్లిలో 87.20,  సాగరలో 36.60,  శికారిపురలో 36.40,  సోరభలో 27,  హోసనగరలో 36.6 మిమీ వర్షపాతం నమోదైంది.

     

    జలాశయాల నీటి మట్టం


     

    అధికారుల వివరాల మేరకు జలాశయాల నీటిమట్టం ఈ విధంగా ఉన్నాయి. ప్రముఖ జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం లింగనమక్కి జలాశయంలో నీటిమట్టం 1778.40 అడుగులు ఉంది. గరిష్ట నీటి మట్టం 1819 అడుగులు. జలాశయంలో 46,341 క్యూసెక్కుల వరద నీరు చేరింది. భద్రా జలాశయం నీటి మట్టం 163.30 అడుగులు కాగా ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం186 అడుగులు. 23,281 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరింది. 144 క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేశారు. తుంగా జలాశయంలో ఇప్పటికే 588.24 అడుగులకు నీరు చేరింది. బుధవారం జలాశయంలోకి 41 వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో చేరగా అంతే ప్రమాణంలోబయటకు విడుదల చేశారు. లింగనమక్కిలో జలాశయంలో బుధవారం నాటికి 1778.40 అడుగుల నీరు చేరింది.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top