పథకం ప్రకారం శశికళపై వల

పథకం ప్రకారం శశికళపై వల


జైల్లో లగ్జరీ వ్యవహారం కేంద్రానికి ఏప్రిల్‌లోనే తెలుసు

సీసీ టీవీ పుటేజీలకు సహకరించిన ఖైదీలు

మాజీ డీజీపీకి రూ.2 కోట్ల ముడుపుల వ్యవహారం


సాక్షి ప్రతినిధి, చెన్నై:

బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో సాధారణ ఖైదీ శశికళ అసాధారణ సౌకర్యాలను అనుభవిస్తున్నట్లు జైళ్లశాఖ (మాజీ) డీఐజీ రూప కనుగొన్నారు. ఈ బాగోతం వెనుక  రూ.2 కోట్లు చేతులు మారినట్లు నిర్ధారించుకుని లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలైంది. అయితే శశికళ చిక్కుకోక ముందే కర్ణాటక హోంశాఖ మాజీ మంత్రి పరమేశ్వర్‌ సహాయకుడు ప్రకాష్‌ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలమే ప్రధాన కారణం.



అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం పొందడం కోసం ఎన్నికల కమిషన్‌కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ రూ.50 కోట్లు ఎరవేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి బ్రోకర్‌ సుకేష్‌కు రూ.10 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన సుకేష్‌ అనే బ్రోకరు ఢిల్లీలో క్రైం బ్రాంచ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. సుకేష్‌ వాగ్మూలంతో దినకరన్, ఆయన స్నేహితుడు బెంగళూరుకు చెందిన మల్లికార్జున్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేశారు.



మల్లికార్జున్‌తో జరిపిన విచారణలో అతను హోంశాఖ మాజీ మంత్రి పరమేశ్వరన్‌ సహాయకుడు ప్రకాష్‌తో తరచూ సంభాషించినట్లు కనుగొన్నారు. ప్రకాష్‌ ద్వారానే రూ.10 కోట్ల హవాలా సొమ్ము ఢిల్లీ చేరినట్లు పోలీసులు తెలుసుకుని అతన్నిఢిల్లీకి పిలిపించుకుని విచారించారు. ఎన్నికల కమిషన్‌కు లంచంతో తనకు సంబంధం లేదని, అయితే దినకరన్‌ మాత్రం తెలుసని అంగీకరించాడు. అయితే బెంగళూరు జైలు అధికారులకు లక్షలాది రూపాయాలు సరఫరా అవుతున్నట్లు తెలిపాడు. శశికళకు లగ్జరీ సౌకర్యాల కోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.



మూడు నెలలుగా నిఘా

ప్రకాష్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని 306 చట్టం సెక్షన్‌ కింద నమోదు చేశారు. అంతేగాక ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు చేరవేశారు. ఆ తరువాత నుంచే శశికళ, ఆమె బంధువులపై గత మూడు నెలలుగా నిఘాపెట్టారు. శశికళకు జరుగుతున్న ప్రత్యేక మర్యాదలను తెలుసకున్నారు. జైలు అధికారులు శశికళ నుంచి సొమ్ము తీసుకుంటున్నట్లు తేలింది. అయితే రెడ్‌హాండెడ్‌గా పట్టుకునేందుకు సీసీ టీవీ పుటేజీలను కేంద్రం సేకరించింది. ఇందుకోసం ఖైదీలనే వాడుకుంది.



శశికళకు తెలియకుండా అంతా గోప్యంగా జరిపించింది. శశికళ మేకప్‌ సామాను, షాపింగ్‌ చేసిన దృశ్యాలను సైతం సేకరించింది. ఈ విషయంలో డీఐజీ రూప ప్రముఖ పాత్ర పోషించారు. బెంగళూరులో రూప ఇంటి పక్కనే కేంద్రమంత్రి ఒకరు నివసిస్తున్నారు. ఉదయం వేళ జాగింగ్‌ సమయంలో ఒకరోజు శశికళ లగ్జరీ జీవితాన్ని మంత్రికి చెప్పినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే రూపను జైళ్లశాఖ డీఐజీగా బదిలీచేసినట్లు కూడా చెబుతున్నారు. కాగా, శశికళకు సంబంధించి ఆధారాలు సేకరించిన ఖైదీలను ప్రస్తుతం అకస్మాత్తుగా వేరే జైలుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top