ఎలుకతో తంటా... రైల్వేకి రూ.10 వేల వడ్డన

ఎలుకతో తంటా... రైల్వేకి రూ.10 వేల వడ్డన


సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రైళ్లలో ఎలుకల స్వైర విహారం చేస్తూ ప్రయాణికులను భయపెడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వాటి పళ్ల వాడికి అనేక వస్తువులు పనికి రాకుండా పోవడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు సహజంగా ‘ఇదంతా మన ఖర్మ’ అనుకుని వెళ్లిపోతుంటారు. కర్ణాటకలోని ఉడిపి  జిల్లాకు చెందిన ఓ ప్రయాణికుడు అలా కర్మ సిద్ధాంతాన్ని వళ్లించి ఊరుకోలేదు.

 

వినియోగదారుల వేదికను ఆశ్రయించి రూ.10 వేల జరిమానా రాబట్టాడు. వివరాల్లోకి వెళితే...ఉడిపి జిల్లా కుందాపురకు చెందిన ప్రదీప్ కుమార్ శెట్టి తన మిత్రులతో కలసి గత ఏడాది రైలులో శబరిమల యాత్రకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కేరళలోని చెంగనూరులో వారంతా తమ భార్యలకు చీరలు, పిల్లలకు దుస్తులు కొనుగోలు చేశారు.



వీటితో పాటు అయ్యప్ప ప్రసాదాన్ని బ్యాగుల్లో పెట్టి, బెర్త్‌ల కింద ఉంచారు.  ప్రయాణంలో ఎలుకలు బ్యాగుల్లోకి ప్రవేశించి అంతా చిందర వందర చేశాయి. చీరలు, పిల్లల బట్టలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి వదిలి పెట్టాయి. మంగళూరుకు వచ్చాక శెట్టి, ఆయన స్నేహితులు బ్యాగులు తెరిచి చూసి నివ్వెర పోయారు. దీనిపై స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసి, రసీదు కూడా తీసుకున్నారు.



అనంతరం రైల్వే ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో దక్షిణ కన్నడ జిల్లా వినియోగదారుల వేదికను ఆశ్రయించారు. వేదిక పంపిన నోటీసులకు కూడా రైల్వే అధికారులు స్పందించలేదు. దీంతో రైల్వేకి శుక్రవారం రూ.10 వేల జరిమానా విధించింది.  నెలలోగా చెల్లించకపోతే ఏడాదికి 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top