కారు అద్దాలు పగలకొట్టి చోరీ


చెన్నై: కాంచీపురం సమీపంలోగల వ్యాపారి కారు అద్దాలను పగులగొట్టి, ఉద్యోగిపై దాడి చేసి 2.5 కిలోల బంగారాన్ని, రూ. 40 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. చెన్నై షావుకారుపేటకు చెందిన కమలేష్ (47). ఈయన నగల దుకాణాలకు బంగారు నగలను తయారు చేసి విక్రయిస్తుంటారు. సోమవారం ఉదయం 8గంటలకు ఆర్డర్ పేరిట వేలూరు, కాంచీపురంలోగల నగల దుకాణాలకు ఆరు కిలోల బంగారు నగలను అందజేసేందుకు తన వద్ద పని చేసే ఉద్యోగులు కాలూరన్ (30), రాజి (23)లకు నగలు ఇచ్చి పంపారు.

 

 వీరు నగలతో కారులో వేలూరుకు బయలుదేరారు. కారును చెన్నైకి చెందిన రవి నడిపాడు. వేలూరు, ఆర్కాడులోని నగల దుకాణాల్లో 3.5 కిలోల బంగారు నగలను ఇచ్చి దీనికి సంబంధించిన నగదు రూ.40 లక్షలను తీసుకున్నారు. ఆ తరువాత సోమవారం సాయంత్రం కాంచీపురంలో గల ఒక నగల దుకాణానికి వచ్చారు. అక్కడ యజమాని లేకపోవడంతో రెండు గంటల సేపు వేచి చూశారు.

 అక్కడ ఆలస్యం కావడంతో రాత్రి 8 గంటలకు నగలతో చెన్నైకి బయలుదేరారు. కాంచీపురం నుంచి చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై కారు వస్తుండగా ఏనాత్తూరు అనే గ్రామంలో రోడ్డు పక్కన కారును నిలిపి అక్కడున్న టీ బంకు దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కారు, నగలు గల కారు పక్కనే నిలిచింది. హఠాత్తుగా కారులో వున్న వ్యక్తులు వేటకొడవళ్లు, దుడ్డుకర్రలతో కిందకు దిగారు. నగలు వున్న కారు అద్దాలను ధ్వంసం చేశారు.

 

 దీన్ని గమనించిన నగల దుకాణం ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే కారులో వున్న 2.5 కిలోల బంగారు నగలను, *40 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. దీన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఉద్యోగి కాలూరన్‌పై దాడి చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న కాంచీపురం తాలూకా పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు. జిల్లా ఎస్పీ విజయకుమార్, డీఎస్పీ బాలచందర్ విచారణ జరిపారు. పోలీసులు అన్ని మార్గాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు అధికారులు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top