యాక్సిడెంటైతే.. యమపాశమేనా

యాక్సిడెంటైతే.. యమపాశమేనా - Sakshi


విలవిల్లాడుతున్నా చికిత్స అందదు

దుర్భరస్థితిలో కన్నుమూయాల్సిందే

శాపంగా మారిన స్పందన లేమి, మౌలిక వసతుల కొరత

ఐఐహెచ్‌ఎంఆర్‌ సర్వేలో చేదునిజాలు




అజయ్‌ ఒక పేరుమోసిన ఐటీ కంపెనీలో ఇంజనీరు. వీకెండ్స్‌లో మిత్రులతో కలిసి విహారానికి బయల్దేరారు. ఊరిబయట టైర్‌ పేలి కారు బోల్తాపడింది. ఒకరిద్దరికి తీవ్ర రక్తస్రావం. చూపరుల్లో ఎవరూ వైద్యానికిగానీ, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికీ గానీ ముందుకురాలేదు. చూస్తుండగానే అజయ్‌ విగతజీవి అయ్యాడు. రాష్ట్రంలో ఈ తరహా అమానుష సంఘటనలకు కొదవలేదు. యాక్సిడెంట్‌ బాధితులకు సకాలంలో వైద్యమందించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా పాలకుల్లో స్పందన లేదని ఒక అధ్యయనం తేల్చింది.  



సాక్షి, బెంగళూరు : రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో బాధితులకు చికిత్స అందడం లేదు. ఇందుకు స్పందించే హృదయాలు లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల లేమి ప్రధాన కారణమని తేలింది. రోడ్డు ప్రమాదాల సంఖ్యలో రాష్ట్రం నాలుగోస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదాలో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.



గ్రామాల్లోనే అధికం  

=  కర్ణాటక ప్రభుత్వం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐహెచ్‌ఎంఆర్‌) సహాయంతో సర్వే నిర్వహించింది.  

= రాష్ట్రంలో 2015లో 44,011 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 5,085 క్రిటికల్‌ (అత్యవసరంగా వైద్య చికిత్స అందించాల్సిన) యాక్సిడెంట్స్‌గా తేలాయి.  



= ఈ క్రిటికల్‌ యాక్సిడెంట్స్‌లో కేవలం 46 శాతం ఘటనల్లో మాత్రమే బాధితులకు గోల్డెన్‌ అవర్‌ (ఘటన జరిగిన తర్వాత గంటలోపు) లోపు వైద్యం అందింది. మిగిలిన వారికి లేదు.  



= పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి.   



స్పందించే హృదయం ఏదీ?   

ఇందుకు కారణం... ప్రజలు మాకెందుకులే అని పట్టించుకోకపోవడం, పోలీసుల నిర్లక్ష్యం, సరైన రవాణా వసతి లేకపోవడమే. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆసుపత్రుల మధ్య సగటు మధ్య దూరం 30 కిలోమీటర్ల పైనే ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ దూరం మరింత ఎక్కువగా ఉంది. దీంతో రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.



ఐదుశాతం మందికే తక్షణ చికిత్స

– డైరెక్టర్‌ నారాయణ్‌ జీనా  


ఐఐహెచ్‌ఎంఆర్‌ సంస్థ డైరెక్టర్‌ బిరించి నారాయణ్‌ జీనా మాట్లాడుతూ...‘మూడు నెలల పాటు సాగిన సర్వేలోగత ఏడాది రాష్ట్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలతో పాటు 1,583 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థల గణాంకాలను పరిశీలించాం. ప్రమాద బాధితుల్లో కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఘటన జరిగిన తర్వాత 8 నిమిషాల్లోపు (గ్లోబల్‌ స్టాండర్డ్‌ రెస్పాన్స్‌ టైం) చికిత్స పొందుతున్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి రక్తస్రావం అరికట్టడానికి చేసే ప్రాథమిక చికిత్స కూడా దక్కడం లేదు. అందువల్లే 2011 నుంచి 2015 ఇప్పటి వరకూ ఏ ఏడాది తీసుకున్నా గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రాథమిక చికిత్సతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పై ప్రభుత్వం దృష్టి సారిస్తే ప్రమాదాల వల్ల కలిగే మరణాల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించవచ్చు.’ అని పేర్కొన్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top