టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్!

టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్! - Sakshi


కార్డుదారులకు డీలర్‌ బెదిరింపు

ఇంటింటికీ తిరిగి రసీదుల అప్పగింత

సరుకులకు వచ్చేటప్పుడు

    రూ.100 అదనంగా తేవాలని హెచ్చరిక

లేదంటే సరుకులు ఇచ్చేది లేదని స్పష్టీకరణ

బెంబేలెత్తుతున్న నిరుపేదలు



కర్నూలు :
టీడీపీ సభ్యత్వ నమోదు టార్గెట్‌ చేరుకోవడానికి నేతలు పేదలను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్నారు. గత నెలలో పలుచోట్ల సభ్యత్వం కోసం వృద్ధులు, వికలాంగుల పింఛన్ లోంచి బలవంతంగా రూ.100 లాక్కున్న విషయం మరువక ముందే తాజాగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్ సరుకులు ఇస్తామని బెదిరింపులకు దిగుతున్నారు.



కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని 5వ చౌక దుకాణం డీలర్‌ నారాయణరావు ఇల్లిల్లూ తిరిగి పార్టీ సభ్యత్వ రసీదు ఇచ్చి వెళుతున్నారు. సరుకులు తీసుకోవడానికి వచ్చేటప్పుడు రూ.100 అదనంగా తేవాలని, లేదంటే సరుకులు ఇవ్వమని హెచ్చరిస్తున్నారు. రేషన్ సరుకుల కోసం డబ్బు సముకూర్చుకోవడమే గగనమైన పేద ప్రజలు టీడీపీ నేత అయిన డీలర్‌ తీరుతో బెంబేలెత్తుతున్నారు. డీలర్‌ నారాయణరావు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. తన పరిధిలోని కార్డుదారుల జాబితా ఆధారంగా పార్టీ సభ్యత్వ రసీదులు పూరించి ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నాడు.



ఆ సమయంలో ‘టీడీపీ సభ్యత్వం తీసుకుంటే మూడు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతుంది. ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. రేషన్ సరుకులకు వచ్చేటప్పుడు ఓటర్‌ కార్డు, రూ.100 తీసుకుని రావాలి. పార్టీ సభ్యత్వం తీసుకోకపోతే సరుకులు వేసేది లేదు’ అని తేల్చి చెబుతున్నాడు. ఈ విషయమై కొందరు కార్డుదారులు రసీదులతో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డుదారులను బెదిరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుండటం పట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.



సరుకులకే డబ్బులు కష్టంగా ఉంది

టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నా. నెల నెలా సరుకులు తెచ్చుకోవడానికి డబ్బులు పోగేసుకోవడం ఇబ్బందిగా ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి డబ్బులు కట్టమంటే మా లాంటి నిరుపేదలకు సాధ్యమయ్యే పనికాదు. సరుకులు తెచ్చుకునేందుకు రేషన్ దుకాణానికి వచ్చేటప్పుడు అదనంగా రూ.100 తీసుకురావాలని డీలర్‌ నారాయణ చెప్పారు. లేదంటే సరుకులు ఇవ్వరట.

– హాషం, కార్డుదారుడు, కోడుమూరు



సభ్యత్వం తీసుకోవడం ఇష్టం లేదు

వ్యాపారం చేసుకుంటూ రోడ్డుమీద బతికేటోళ్లం. పార్టీల ముద్ర వేసుకుంటే మార్కెట్‌లో వ్యాపారాలు చేసుకోలేం. డీలర్‌ నారాయణ టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని రసీదు రాసిచ్చాడు. సరుకులు తీసుకునేందుకు వచ్చేటప్పుడు రూ.100, ఓటర్‌ కార్డు తీసుకుని రమ్మన్నాడు. మాకైతే సభ్యత్వం తీసుకోవడం ఇష్టం లేదు.

– సలీంబాషా, కార్డుదారుడు, కోడుమూరు

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top