చేజారుతున్న బతుకులు ..

చేజారుతున్న బతుకులు .. - Sakshi

  •   గాల్లో కలిసిపోతున్న రైలు ప్రయాణికుల ప్రాణాలు

  •  ప్రమాద నివారణ చర్యలు శూన్యం

  •  ప్రయాణికుల నిర్లక్ష్యం కూడా కారణమే

  • గుంతకల్లు టౌన్:  అత్యధిక జన సాంద్రత గల ప్రదేశమేదని ఎవరైనా అడిగితే, రైలులోని జనరల్ బోగీ అని టక్కున సమాధానం చెప్పవచ్చు. ఒకరిపై ఒకరు, ఒంటి కాలిపై నిల్చుని చేసిన రైలు  ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఓసారి అనుభవం లోకి వచ్చే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుట్‌బోర్డు వద్ద నిలుచునో, కూర్చునో ప్రయాణించేవారు ఎందరో కనిపిస్తారు. నిద్రమత్తులోనో, లోపలి జనం ఒత్తిడి కారణంగానో పట్టుజారి కింద పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. వివరాలిలా ఉన్నాయి.  



    గుంతకల్లు డివిజన్ మీదుగా రోజూ 120 రైళ్లు నడుస్తున్నాయి. వీరిలో అధికభాగం పొట్టకూటికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే ప్రయాణికులే ఉంటారు. సకాలంలో గమ్యానికి చేరుకోవాలన్న ఆతృత, రైలుతో సీటు దొరకదేమోనన్న ఆందోళనతో రైలు ఆగకముందే లగేజీతో సహా పరుగులు తీసే దృశ్యాలు రోజూ కనిపిస్తూనే ఉంటాయి. ఆర్థిక స్తోమత లేని కారణంగా వీరంతా జనరల్ బోగీలోనే ప్రయాణిస్తుంటారు. అయితే, వీరి సంఖ్యకు అనుగుణంగా రైళ్లలో బోగీలు ఉండకపోవడం రద్దీకి కారణమవుతోంది. ఫలితంగా కొందరు ఫుట్‌బోర్డుపై ప్రయాణించాల్సిన పరిస్థితికి కారణమవుతుంది.



    వెళుతున్న రైలులోంచి జారిపడి మృతి చెందిన, గాయపడిన వారిలో ఇలాంటి వారే అధికంగా ఉంటున్నారు. ఇక టికెట్ లేకుండా ప్రయాణం చేసే కొందరు టీటీఈలను చూసి భయంతో కదులుతున్న రైలులోంచి దూకడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, ఈ ప్రమాదాల్లో మృతి చెందిన వారిని గుర్తు పట్టేందుకు కూడా అవకాశాలు లేకపోవడంతో, అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి.

     

    ఏడాదిలో 302 మంది మృత్యువాత

     

    గుంతకల్లు జీఆర్పీ ఎస్పీ కార్యాలయ పరిధిలో అనంతపురం, కర్నూల్, వైయస్‌ఆర్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది జరిగిన వివిధ ప్రమాదాల్లో దాదాపు 302 మంది ప్రయాణికులు మృత్యువాత పడినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.  ఈ ఘటనల్లో పురుషులు-154 మంది, 12 మంది మహిళల మృతదేహాలు గుర్తు పట్టగా, మిగిలిన 122 మంది పురుషులు, 14 మంది మహిళల మృతదేహాలు ఎవరివైనదీ తెలియడం లేదని  పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.  

     

    ప్రయాణికుల నిర్లక్ష్యం కూడా కారణమే..

     

    రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రతిసారీ అధికారుల అసమర్థతను ప్రశ్నించడం సాధారణమే. అయితే, ప్రయాణికుల బాధ్యతా రాహిత్యం, అవగాహన లేమి కూడా ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. రైలు కదులుతున్నపుడు ఎక్కడం, దిగడం, ఫుట్‌బోర్డుపై ప్రయాణం ప్రమాదకరమని రైలు స్టేషన్లలో ప్రకటనలు చేస్తున్నా ప్రయాణికులు పట్టించుకోవడం లేదు.



     ప్రమదాల నివారణకు  చర్యలేవీ?

     

    ఎంతసేపూ కోట్లాది రూపాయలను ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే శాఖ ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించడం లేదు.   రైల్వేస్టేషన్లు, రైళ్ల లోపల, లెవెల్‌క్రాసింగ్‌లు మొదలైన ప్రాంతాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ప్రయాణికుల్లో అవగాహన పెంపొందించేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫుట్‌బోర్డు ప్రయాణాలను అరికట్టడంలో భాగంగా అవసరమైనన్ని బోగీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top