వామ్మో..రూ.50 కోట్లా!




ఆర్కేనగర్‌లో ధన ప్రవాహం

70 వేల ఓటర్లే లక్ష్యం

ఎన్నికల కమిషన్‌ విస్మయం



ఎన్నికల్లో నోట్లు లేనిదే ఓట్ల వర్షం పడదని గట్టిగా విశ్వసిస్తున్న నేతలు  పెరిగిపోతున్నారనేందుకు ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాలని రూ.50 కోట్లు వెదజల్లేందుకు రాజకీయపార్టీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారంతో ఈసీ నోరెళ్లబెట్టింది.



సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎదిగి జాతీ యస్థాయిలో చక్రం తిప్పిన జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కేనగర్‌లో విజ యం అన్ని పార్టీల అభ్యర్థులకు ప్రతిష్టాత్మకమే. అందునా అన్నాడీఎంకేలోని చీలికవర్గాల అభ్యర్థులు దినకరన్, మధుసూదనన్‌లకు జీవన్మరణ సమస్యగా మారిం ది. అమ్మను ఆదరించిన ఆర్కేనగర్‌ ప్రజలు ఎవరికి పట్టం కడితే వారే అన్నాడీఎంకేకు అసలైన వారసులమని ప్రచారం చేసుకోవచ్చు. ఈ ఒక్క వాక్కును నిజం చేసుకునేందుకు దినకరన్, మధుసూదనన్‌ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అమ్మ వారసురాలిగా దీప రంగంలో ఉన్నారు.



రాష్ట్రానికి ఇక తమ పార్టీనే దిక్కు అని చాటుకునేలా గెలుపొందేందుకు డీఎంకే కూడా గట్టి ప్రయత్నం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ తమిళనాడులోకూడా తమ సత్తా చాటుకోవాలని ఆర్కేనగర్‌లో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక డీఎండీకే, వామపక్షాల అభ్యుర్థులు యథాశక్తి గా పాటుపడుతున్నారు. ఆర్కేనగర్‌లో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండగా గెలుపు బావుటా ఎగురవేసేందుకు రాజకీయ పార్టీలు రూ.50 కోట్లను సిద్ధం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్‌కు విశ్వసనీయ సమాచారం అందింది.



ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పంచేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఆర్కేనగర్‌లో మొత్తం 2.62 లక్షల ఓటర్లుండగా వీరిలో కనీసం 75 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. కనీసం 70 వేల ఓటర్లను నోటుతో మభ్యపెట్టవచ్చని కొందరు అభ్యర్థులు నమ్మకంతో ఉన్నారు. ఒక ఇంటిలో ఐదు ఓట్లు ఉన్నట్లయితే రూ.25వేలు దక్కుతుంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఇస్తున్నప్పుడు ఎవరు వద్దంటారని కొందరు విశ్లేషిస్తున్నారు.



సీఎం కుర్చీపై దినకరన్‌ కన్ను:

 అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆ పార్టీలోని ప్రముఖులందరికీ సీఎం కుర్చీపై కన్నుపడింది. జయ మరణించగానే గత అనుభవాలరీత్యా పన్నీర్‌సెల్వం సీఎం అయ్యారు. జయ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే సీఎం కాకుండానే ఆమె జైలుపాలు కావడంతో ఎడపాడి పళనిస్వామి ఆ చాన్స్‌ కొట్టేశారు. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వానికి శశికళ అన్నీతానై నడిపిస్తుండగా ఆమె అక్క కుమారుడు దినకరన్‌ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగానే సీఎం పీఠంపై ఆశ పెంచుకున్నారు. ఇందుకు ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలు దినకరన్‌కు అవకాశంగా మారాయి. అయితే ఆర్కే నగర్‌లోని అన్నాడీఎంకే ఓటు బ్యాంకును  మధుసూదనన్, దీప కూడా పంచుకోవడం వల్ల దినకరన్‌ గెలుపు అంత సులువు కాదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సీఎం కావాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. శశికళ ఆదేశాల మేరకు 30 మంది మంత్రులు, 30 మంది ఎంపీలు, వందకు పైగా ఎమ్మెల్యేలు, అనేక జిల్లాల కార్యదర్శులు, సినీనటీనటులు ఆర్కేనగర్‌లో తిష్టవేసి మరీ ప్రచారం చేస్తున్నారు. దినకరన్‌ ఎన్నికల చిహ్నం టోపీని ఇంటింటా పంచుతూ ఓటు కోరుతున్నారు.



దినకరన్‌పై పన్నీర్‌ ఫిర్యాదు:

అధికారుల అండదండలతో ఆర్కేనగర్‌లోని ఓటర్లను నోట్లతో మభ్యపెడుతున్నాడని అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి టీటీవీ దినకరన్‌పై మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను మంగళవారం ఢిల్లీలో స్వయంగా కలుసుకుని ఫిర్యాదు చేశారు. దినకరన్‌ తన ఎన్నికల చిహ్నమైన టోపీ లోపల రహస్యంగా నగదును ఉంచి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఇదిలా ఉండగా పుదుచ్చేరీ నుంచి ఆర్కేనగర్‌కు వెళుతున్న లారీని తనిఖీ చేయగా పుచ్చకాయల లోడు కింద వంద అట్టపెట్టెల్లో 2400 బీరు బాటిళ్లు బైటపడ్డాయి. ఈ కేసులో శివలింగం, రామ్‌జీ అనే యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.



సమస్యాత్మక నియోజకవర్గంగా ఆర్కేనగర్‌:

ఆర్కేనగర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టీ మొత్తం నియోజవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా పరిగణించే అవకాశాలను ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్కేనగర్‌లో మొత్తం 50 ప్రాంతాల్లో 256 పోలింగ్‌ కేంద్రాలుండగా 29 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల కమిషన్‌ గుర్తించింది. ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. అభ్యర్థుల ప్రచారం వేడెక్కేకొద్దీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, నగదు బట్వాడా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆర్కేనగర్‌ పరిధినంతా సమస్యాత్మక  నియోజకవర్గంగా గుర్తించేందుకు అధికారులు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.



అదే పేరు...అభ్యర్థుల బేజారు:

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గెలుపొందాలంటే పేరు, పార్టీ, ఎన్నికల చిహ్నం...వీటిలో కనీసం ఏదో ఒకటైనా బహుళ ప్రాచుర్యం పొంది ఉండాలి. అన్నాడీఎంకే నుంచి విడిపోయి ప్రత్యర్థులుగా రంగంలో నిలిచిన దినకరన్, మధుసూదనన్‌ ఆర్కేనగర్‌ ఎన్నికల్లో వేర్వేరు కొత్త పార్టీలు, సరికొత్త గుర్తులపై పోటీచేస్తున్నారు. ఇక ఆ మూడింటిలో వారికి మిగిలింది పేరు ప్రఖ్యాతులు మాత్రమే అనే సంతోషం లేకుండా పోయింది. దినకరన్‌ పేరున మొత్తం ముగ్గురు, మధుసూదనన్‌ పేరున ఇద్దరూ ఆర్కేనగర్‌ అభ్యర్థులుగా ఉన్నారు. ఒకరి గెలుపును మరొకరు దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా అదే పేరుతో కూడిన అభ్యర్థులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ, కొత్త గుర్తులేగాక తమ పేరుతో మరికొందరు అభ్యర్థులు ఉండడం వల్ల ఓటర్లు ఆయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందని దినకరన్, మధుసూధనన్‌ బేజారెత్తిపోతున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top