సభలో కల్తీ చర్చ

సభలో  కల్తీ చర్చ


చర్యలు తప్పదన్న మంత్రి బాలాజీ

పరిశోధన సాగుతున్నట్టు వివరణ

హార్బర్‌ ప్రైవేటీకరణపై సీఎం వ్యాఖ్య

తామెప్పుడూ ప్రజల పక్షమే: స్టాలిన్‌


పాలల్లో రసాయనాల కల్తీ వ్యవహారం అసెంబ్లీకి చేరింది. ప్రధాన ప్రతిపక్షం పట్టుతో స్పీకర్‌ చర్చకు అనుమతి ఇచ్చారు. కల్తీ విషయంలో తగ్గేది లేదని, పరిశోధనల మేరకు చర్యలు తప్పదని పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్పష్టం చేశారు. ఇక ఎన్నూరు కామరాజర్‌ హార్బర్‌ ప్రైవేటీకరణపై తమకు ఎలాంటి సమాచారం లేదని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. ఇక, వాకౌట్లు సాగించినా, మళీ అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల పక్షాన తాము పోరాడుతున్నామని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.

సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం పాలకల్తీపై ఇది వరకు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ చేసిన సంచలన ప్రకటనపై చర్చకు ప్రధాన ప్రతిపక్షం పట్టుబట్టింది. స్పీకర్‌ ధనపాల్‌ అనుమతి ఇవ్వడంతో ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ ప్రసంగాన్ని అందుకున్నారు. ప్రైవేటు పాలల్లో రసాయనాల కల్తీపై మంత్రి చేసిన సంచలన ప్రకటనను గుర్తు చేశారు.



కల్తీని ధ్రువీకరించే విధంగా నిర్ధారణ సాగినట్టు, ఈ వ్యవహారం నిగ్గు తేలని పక్షంలో ఉరి కంబం ఎక్కేందుకు తాను సిద్ధమని మంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తన దైన శైలిలో స్టాలిన్‌ స్పందించారు. అయితే, ఈ కల్తీ విషయంలో తీసుకున్న చర్యలు ఏమిటోనని ప్రశ్నించారు. డీఎంకే శాసన సభాపక్ష ఉప నేత దురైమురుగన్‌ సైతం తన ప్రసంగలో కల్తీ వ్యవహారంలో ఇప్పటివరకు సాగిన పరిణామాలను గుర్తు చేస్తూ, చర్యలు ఎక్కడ అని ప్రశ్నల వర్షం కురిపించారు. భిన్న వాదనలు ప్రభుత్వంలోనే ఈ వ్యవహారం మీద సాగుతున్నాయని విమర్శలు గుప్పించారు.



పాలల్లో కల్తీ లేనట్టుగా  కోర్టుకు ఆరోగ్యశాఖ నివేదించి వివరణలు అసెంబ్లీ ముందు ఉంచారు. దీంతో మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వివరణ ఇస్తూ, తన ప్రకటనకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టం చేశారు. పాల కల్తీ నిగ్గు తేల్చేందుకు తగ్గ పరిశోధనలకు అడ్డు పడే వాళ్లూ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎదురైనా పరిశోధన సాగుతుందని, చర్యలు తప్పదని స్పష్టం చేశారు. తాము ఇప్పుడే చర్యలు తీసుకున్న పక్షంలో ప్రైవేటు సంస్థలు కోర్టుల్ని ఆశ్రయించి జరిమానాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని, అందుకే పరిశోధన నివేదిక ఆధారంగా ఒకేసారి వేటు పడే విధంగా చర్యలు తీసుకుని తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ఓ పర్యవేక్షణ కమిటీ, జిల్లాల కలెక్టర్ల స్థాయిలో ఆయా జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు పాల కల్తీపై పరిశీలన సాగిస్తున్నట్టు తెలిపారు. తదుపరి సభలో న్యాయశాఖకు నిధుల కేటాయింపులపై ఆ శాఖ మంత్రి సీవీ షణ్ముగం వివరించారు.



హార్బర్‌ ప్రైవేటీ కరణ సమాచారం లేదు : ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలను ప్రభుత్వం ముందు ప్రతి పక్షాలు ఉంచాయి. ఆ మేరకు ఎన్నూరు కామరాజర్‌ హార్బర్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నదంటూ వచ్చిన వార్తలపై సభలో ప్రభుత్వాన్ని డీఎంకే సభ్యులు ప్రశ్నించగా, సీఎం స్పందించారు. అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. కేంద్రం వంద శాతం వాటాల్ని వెనక్కు తీసుకుంటున్నట్టుగా మీడియాలో మాత్రమే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ విషయంగా కేంద్రాన్ని, కేంద్ర నౌకాయన శాఖ నుంచి సమాచారం రాబట్టే యత్నం చేస్తామన్నారు



. ఇక, హార్బర్‌ వెంబడి రోడ్డు మీద నివాసం ఉంటున్న వారికి సొంత గృహాల నిర్మాణం గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్‌ స్పందించారు. బహుళ అంతస్తుల గృహాల నిర్మాణం సాగుతోందని, అందులో వారికి కేటాయింపులు ఉంటాయని వివరించారు. ఇక, తిరుచ్చి తుపాకీ పరిశ్రమ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నించగా, అలాంటి సమాచారం లేదని ప్రభుత్వం తరఫున డీఎంకే సభ్యులకు మంత్రి వివరణ ఇచ్చారు.

ప్రజల పక్షం : డీఎంకే వాకౌట్ల పర్వంతో సభా సమయాన్ని వృథా చేస్తున్నట్టుగా అధికార పక్షం విమర్శలు గుప్పించడంతో స్టాలిన్‌ స్పందించారు. ప్రధాన ప్రతిపక్షం గళం నొక్కడం లక్ష్యంగా అధికార పక్షం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పదే పదే సమస్యలను ప్రస్తావించినా, చర్చకు పట్టుబట్టినా, పాలకులు ఖాతరు చేయని దృష్ట్యా, వాకౌట్‌తో తమ నిరసన తెలియచేస్తున్నామని గుర్తు చేశారు. వాకౌట్‌ చేసి తాము ఇళ్లకు వెళ్లడం లేదని, మళ్లీ సభలోకే వెళ్లి మరో అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీలో ఆరోగ్యకర వాతావరణం లేదని, ప్రధాన ప్రతిపక్షం సహకరిస్తున్నా, పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడూ తాము ప్రజల పక్షమేనని, ప్రజల పక్షాన తమ గళం అసెంబ్లీలో వినిపిస్తూనే ఉంటుందన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top