ప్రజాధనం కార్ల పాలు..

ప్రజాధనం కార్ల పాలు..


స్టాండింగ్ కమిటీ చైర్మన్‌కు ఏడాదికో కారు

నిబంధనలకు నీళ్లొదులుతున్న బీఎంసీ

మరమ్మతుల వల్ల మార్చాల్సి వస్తోందంటూ అధికారుల వివరణ


 

సాక్షి, ముంబై : రోడ్లపై ఏర్పడిన గుంతలు, నీటి కొరత విషయమై కార్పొరేషన్ చర్యలు తీసుకోనప్పటికీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌కు మాత్రం ఏడాదికోసారి కొత్త కారును కొనుగోలు చేస్తోంది. గత ఆరేళ్లుగా బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్టాండింగ్ కమిటీ చెర్మైన్ కోసం ఆరు కార్లను కొనుగోలు చేసింది. ఇదిలా వుండగా, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ వాహనాలను మార్చాలంటే అవి కనీసం పదేళ్లపాటు వాడినవై ఉండాలి.. అలాగే 2.4 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉండాలి.



ఇదిలా ఉండగా స్టాండింగ్ కమిటీ చైర్మన్ కోసం ఆరేళ్లలో కార్పొరేషన్ మహేంద్ర లోగాన్, టాటా మన్జా, ఫియట్ లేనియా, మారుతి స్విఫ్ట్, టొయోటా, ప్రస్తుతం మహేంద్ర స్కార్పియోను కొనుగోలుచేసింది. కాగా, స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాహుల్ షెవాలే తన పదవీ కాలంలో ఎక్కువ కార్లను మార్చారని తేలింది. షేవాలే 2010లో చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నిక కావడంతో స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అతని పదవీకాలం నాలుగేళ్లలో నాలుగు కార్లను అతని కార్యాలయంలో మార్చారు. అతను ఆరు నెలల కిందట స్విఫ్ట్ డిజైన్‌ను మార్చారు.



ఈ విషయమై స్టాండింగ్ కమిటీ చెర్మైన్ యశోదర్ ఫాన్సే స్పందిస్తూ.. స్టాండింగ్ కమిటీ చెర్మైన్ కోసం ఆరు ఏళ్లకు ఆరు కార్లను బీఎంసీ ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. తన ప్రస్తుత కారు మాత్రం ఏడేళ్ల పురాతనమైందన్నారు. ఈ కారు పలుమార్లు మరమ్మతులకు లోనైందని తెలిపారు. తను హౌజ్‌కు లీడర్ అయినప్పటికీ పురాతన కారునే ఉపయోగిస్తున్నానన్నారు. ఇప్పటికీ తనకు కొత్త కారు అందలేదన్నారు.



ఇదిలా వుండగా, చీఫ్ ఇంజినీర్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగం) సిరాజ్ అన్సారీ మాట్లాడుతూ.. రెండు నెలల క్రితమే స్టాండింగ్ కమిటీ చెర్మైన్ తన పురాతన కారు పరిస్థితిని వివరిస్తూ కొత్త కారు కోసం ఓ లేఖ రాశారన్నారు. ప్రస్తుతం ఉన్న స్కార్పియో పురాతనమైంది కావడంతో తాము కొత్త కారును కొనుగోలు చేశామన్నారు. కాగా, మార్చ్‌లో టయోటా పాడవడంతో మరమ్మతుల కోసం పంపించామన్నారు. ఈ కార్లను ఎక్కువ మార్లు ఉపయోగించడంతో తరచూ పాడవుతున్నాయని ఆయన వివరించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top