మహిళల తొలి విజయం

మహిళల తొలి విజయం


కేకేనగర్‌ : తమిళనాడులో టాస్మాక్‌(తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన మహిళలకు తగిన ప్రతిఫలం లభిస్తోంది. రాష్ట్రంలో టాస్మాక్‌ లేని తాలుకాగా సెందురై నిలిచింది. ఇది ఇక్కడి మహిళలకు లభించిన మొదటి గెలుపు. అరియలూరు జిల్లా, సెందురై తాలుకాలో గతంలో 8 టాస్మాక్‌ దుకాణాలు ఉండేవి. ఈ క్రమంలో ఏప్రిల్‌ 10న పొన్‌కుడిక్కాడు ప్రాంతంలో టాస్మాక్‌ ప్రారంభించడానికి వచ్చిన సూపర్‌వైజర్‌ను మహిళలు అడ్డుకున్నారు. అయితే అధికారులు  పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు మద్యం దుకాణాన్ని ధ్వంసం చేశారు. అదే విధంగా సెందురై రాయల్‌సిటీ ప్రాంతంలో టాస్మాక్‌ ప్రారంభించకుండా అడ్డుకున్నారు. అయితే పోలీసుల భద్రతతో మద్యం దుకాణం ప్రారంభిస్తున్నట్టు తెలుసుకొని, ఆ దుకాణం తాళం పగలగొట్టి మద్యం సీసాలను ధ్వంసం చేశారు.



అదేవిధంగా 16న ఆర్‌ఎస్‌. మాత్తూర్‌ ప్రాంతంలో మద్యం బాటిళ్లను రోడ్డుపై పగలగొట్టి నిరసన తెలిపారు. 17న తళవాయి, సెంగమేడు, ఈచ్చంకాడు గ్రామాల మహిళలు టాస్మాక్‌ దుకాణం వద్ద పోలీసుల భద్రతను మీరి దుకాణంలోకి ప్రవేశించి రూ. 10 లక్షల విలువైన మద్యం సీసాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కొందరు మహిళలపై కేసులు పెట్టారు. వరుస ఆందోళనల నేపథ్యంలో  సెందురై తాలుకాలో దుకాణంలోని మద్యం బాటిళ్లను లారీల్లో పెరంబలూరుకు తరలించారు. దీంతో తాలుకాలో ఉన్న 7 టాస్మాక్‌ దుకాణాలు మూతపడ్డాయి. మిగిలిన  ఇరుంబులికురిచ్చి టాస్మాక్‌ దుకాణం ప్రారంభించడానికి మంగళవారం ఉదయం మద్యం సీసాలతో వచ్చిన వ్యానును మహిళలు అడ్డుకోవడంతో ఆ దుకాణం కూడా మూత పడింది. దీంతో రాష్ట్రంలో మద్యం దుకాణాలు లేని తాలుకాగా సెందురై ప్రత్యేకతను చాటుకుంది.



అదే బాటలో: అదేవిధంగా నాగపట్నం నడుకరై గ్రామ పంచాయతీ మేల్‌వీధి గ్రామంలో టాస్మాక్‌ దుకాణం  తొలగించాలని కోరుతూ ప్రజలు ఆందోళనకు దిగారు. కరూర్‌ జిల్లా కార్‌వలి గ్రామంలో కొత్తగా ప్రారంభించిన టాస్మాక్‌ దుకాణాన్ని మూసి వేయాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు. తిరునెల్వేలి పావూర్‌ సత్రం సమీపంలో మద్యం దుకాణాన్ని మూసివేయాలని కోరుతూ ప్రజలు రాస్తారోకోకు దిగారు. ఈ రాస్తారోకోలో విద్యార్థులు, మహిళలతో సహా 200 మందికి పైగా పాల్గొన్నారు. వారందరూ ఊరేగింపుగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. తూత్తుకుడి ఎట్టయ్యాపురం సీపీఎం కార్యదర్శి రవీంద్రన్‌ ఆధ్వర్యంలో గ్రామ మహిళలు కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో కొత్తగా నిర్మించిన టాస్మాక్‌ దుకాణాన్ని తొలగించాలని నినాదాలు చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top