చంద్రాపూర్ జిల్లాలో మద్య నిషేధం

చంద్రాపూర్ జిల్లాలో మద్య నిషేధం


రాష్ట్రమంత్రివర్గ నిర్ణయం

ఫలించిన జిల్లావాసుల ఐదేళ్ల పోరాటం


సాక్షి, ముంబై: చంద్రాపూర్ జిల్లా వాసుల ఐదేళ్ల పోరాటం ఫలించింది. ప్రజల కోరికను మన్నించిన ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లాలో మద్యం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. విదర్భ ప్రాంతంలోని గనుల జిల్లాగా పేరొందిన చంద్రాపూర్‌లో మద్యం అమ్మకం, కొనుగోలు, ఉత్పత్తి, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.



మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మహారాష్ట్రలో మద్యం నిషేధాన్ని అమలు చేయనున్న మూడో జిల్లా చంద్రాపూర్ కానుంది. తూర్పు మహారాష్ట్రలో చంద్రాపూర్‌కు పొరుగునున్న వార్ధా, గడ్చిరోలీ జిల్లాల్లో కూడా మద్య నిషేధం అమలులో ఉంది. ప్రభుత్వ ప్రకటనతో జిల్లా వాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు అభినందించుకున్నారు. ముఖ్యంగా మహిళలు నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

 

రాష్ట్ర సరిహద్దులో ఈ మూడు జిల్లాలు ఉన్నందున అక్రమ మద్యం వ్యాపారం కొనసాగే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఒక అధికారి అభిప్రాయపడ్డారు. మద్యం వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక న్యాయ విభాగం ఒక కార్యక్రమాన్ని చేపడుతుందని ఆయన చెప్పారు. ఈ మూడు జిల్లాల్లో మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం పోలీసు, ఎక్సైజ్ శాఖలకు సరిపోను సిబ్బందిని సమకూరుస్తామని అన్నారు. ప్రస్తుతం చంద్రాపూర్ జిల్లాలో జారీ చేసిన మద్యం పర్మిట్లన్నింటినీ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామని చెప్పారు.

 

ఐదేళ్ల పోరాటం

చంద్రాపూర్‌లో మద్యం నిషేధం అమలు చేయాలని 2010 నుంచి అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సు మేరకు నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటు వార్ధా జిల్లాలో కూడా సంపూర్ణ మద్యం నిషేధం అమలవుతోంది. అటు గడ్చిరోలీ జిల్లాలో 1992 నుంచే మద్య నిషేధం అమలులో ఉంది.

 

చంద్రాపూర్‌లో మద్య నిషేధం విధించడాన్ని జిల్లా ఇన్‌చార్జి, ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ స్వాగతించారు. తన రాజకీయ జీవితంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయమని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే తన జిల్లా ప్రజల వాణిని వినిపించానని చెప్పారు. 2010లో అసెంబ్లీలో ప్రైవేటు సభ్యుని తీర్మానాన్ని ప్రవేశపెట్టానని తెలిపారు. జిల్లాలో ఒక్కో కుటుంబం ఏడాదికి సగటున రూ.10వేలు మద్యంపై ఖర్చు చేస్తోందని చెప్పారు.



జిల్లాలో సుమారు వెయ్యి నుంచి 1,200 కోట్ల రూపాయలు మద్యంపై వృథా అవుతున్నట్లు ఒక అంచనా అని అన్నారు. జిల్లాలో 847 గ్రామ పంచాయతీలుండగా, మద్య నిషేధం విధించాలని 588 పంచాయతీలు తీర్మానం చేశాయి. 2010లో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా జిల్లాకు చెందిన ఉద్యోగినులు చీమూరు నుంచి నాగపూర్ వరకు 130 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి మద్యం నిషేధం విధించాలని డిమాండ్ చేశా రు. 22 లక్షల మంది ఉన్న జిల్లాలో రూ.600 కోట్ల మద్యం వినియోగమవుతోంది.

 

రాష్ట్రమంతటా అమలు చేయాలి: భంగ్

మద్య నిషేధాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని సామాజిక కార్యకర్త అభయ్ భంగ్ డిమాండ్ చేశారు. గుజరాత్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉందని, అయినా అక్కడ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగడం లేదని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలో మద్యంపై ఏటా రూ.10వేల కోట్ల ఆదాయం వస్తోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top