పోలీసు రాజ్యం!

పోలీసు రాజ్యం! - Sakshi

పార్వతీపురంలో ప్రజా సంఘాల నేతల అరెస్టు

ఎమర్జెన్సీని తలపించే వాతావరణం

భగ్గుమంటున్ను బోడికొండ గ్రామాలు   

 

పార్వతీపురం : పార్వతీపురంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. అధికార పార్టీ నాయకుల అక్రమాలు, అవినీతిపై ప్రశ్నించినా, అడ్డగోలు అనుమతులను వ్యతిరేకించినా... అటువంటి వారిపై ఖాకీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఖాకీ యూనిఫామ్‌ వేసుకొని టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు తమదైన శైలిలో టీడీపీ దౌర్జన్యాన్ని వ్యతిరేకించిన వారిపై విరుచుకుపడుతున్నారు. దీనిలో భాగంగా  ఆదివారం వైఎస్సార్‌ సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త అరెస్ట్, అడవుల్లో తిప్పడం, ఆ రాత్రంతా పోలీస్‌స్టేషన్లను మార్చి మార్చి హింసించడంతో పాటు ఐపీసీ సెక్షన్లను వేయడం తదితర సంఘటనలు పాఠకులకు తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఆయా గ్రానైట్‌ బాధిత గ్రామాల గిరిజనులకు భయం కల్పించేలా సాయుధులైన పోలీసు బలగాలను మొహరించడంతో పాటు దొరికిన వారిని దొరికినట్లు ఎత్తుకెళ్లడం జరుగుతున్నాయి. పోలీసు చర్యలతో బోడికొండ బాధిత గిరిజన గ్రామాలు భగ్గుమంటున్నాయి. అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా సీపీఎం నాయకులు పట్టణ మెయిన్‌ రోడ్డులో మంగళవారం ర్యాలీ చేస్తుంటే ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు తమదైన శైలిలో వారిని ఎత్తుకెళ్లి వాహనాలలో విసిరేశారు. అరెస్ట్‌లు చేశారు. 

 

ఇదిలా ఉండగా వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక ఏరియా ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా బాధిత గిరిజన గ్రామాల్లోకి వెళ్లి గిరిజనులను అరెస్ట్‌లు చేసేందుకు పోలీసులు సమాయత్తమవుతున్న తరుణంలో, అక్కడ గిరిజనులు కూడా బతుకులు పోగొట్టే గ్రానైట్‌ కంపెనీ వచ్చాక, ఇక చావో...రేవో తేల్చుకుంటామనే ధోరణిలో సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల పొలిమేరల్లోకి వెళ్లకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.  గిరిజనులకు ఆధారమైన నీటిని అడ్డుకుంటూ...చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై కనీస చర్యలకు ఉపక్రమించకుండా దానిని అడ్డుకున్న గిరిజనులు, పోరాట కమిటీ నాయకులపై విరుచుకుపడడం సరికాదనే చర్చ సాగుతోంది. పార్వతీపురం టౌన్‌ : బోడికొండ, బడిదేవర కొండల వద్ద జరుగుతున్న ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం, రైతు కూలీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. అటవీ హక్కులను తుంగలో తొక్కి చట్టాలను విస్మరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాలకులు అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని, పోరాడితే అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేనిసూర్యనారాయణ ధ్వజమెత్తారు. సీపీఎం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం బోడికొండ, బడిదేవర కొండల లీజులను రద్దు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. బెలగాం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా ర్యాలీ కొనసాగుతుండగా వైఎస్సార్‌ కూడలిలో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

 

దౌర్జన్యంగా జీపులో ఎక్కించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పోలీసులు కావాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణకు విరుద్దంగా అడ్డగోలు అనుమతులు ఇవ్వడమే కాకుండా పోరాడుతున్న వారిపై తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కేసులు బనాయించడం దారుణమన్నారు. సీపీఎం డివిజన్‌ కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ గిరిజన జీవన విధానానికి భంగం కలిగించేలా అడ్డగోలు అనుమతులు ప్రభుత్వం ఇవ్వడాన్ని నిరసించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ఆందోళనలో రెడ్డి ఈశ్వరరావు, వై.మన్మధరావు, వెలగాడ కృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు.  

 

పార్వతీపురం టౌన్‌ : పార్వతీపురం పట్టణంలో బోడికొండ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన నాయకులను తరలిస్తున్న పోలీసు జీపు డ్రైవర్‌గా ఓ బీజేపీ కార్యకర్త పని చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు వాహనాన్ని నడపాల్సిన పరిస్థితి బీజేపీ పార్టీకి చెందిన అల్లూరి పేర్రాజుకు ఎందుకు వచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా తన సిబ్బందిని వినియోగించకుండా బీజేపీకి చెందిన కార్యకర్తను డ్రైవర్‌గా ఎందుకు నియమించారో అర్ధంకాని పరిస్థితి.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top