బిగుస్తున్న ఉచ్చు

బిగుస్తున్న ఉచ్చు - Sakshi


ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థల అధినేత పచ్చముత్తు పారివేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఒక్క మోసం కేసులే కాకుండా, మరెన్నో ఆరోపణలు తెరమీదకు వస్తున్నాయి. ఆ విద్యా సంస్థల స్థల వ్యవహారం మొదలు, బెదిరింపుల వ్యవహారాలపై విచారణ బృందం దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. ఇక, తనకు పచ్చముత్తు, ఆయన వర్గీయుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నట్టు ఓ సినీ

 ఫైనాన్షియర్ భద్రత కోసం పోలీసుల్ని శనివారం ఆశ్రయించారు.

 

 సాక్షి, చెన్నై: వేందర్ మూవీస్ మదన్ అదృశ్యం, సీట్ల పేరిట కోట్లు మోసం ఆరోపణల వ్యవహారాలు వెరసి విద్యా రంగంలో అందనంత ఎత్తులో ఉన్న ఎస్‌ఆర్‌ఎం అధిపతి పచ్చముత్తును కటకటాల పాలు చేశాయి. రిమాండ్‌కు కోర్టు ఆదేశాలు జారీచేయడంతో ఆయన్ను పుళల్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు ప్రత్యేకంగా గదిని కేటాయించి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. జైలు నిబంధనల్ని ఉల్లంఘించి మరీ ఆయనకు ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలు కల్పించినట్టు తమిళ మీడియాల్లో సైతం సమాచారాలు వెలువడ్డాయి. క్యాంటీన్ నుంచి ఆయనకు ఆహారం తీసుకొచ్చి ఇచ్చినట్టు, అలాగే, ఆయన ధరించి ఉన్న విగ్‌ను కూడా అలాగే వదలిపెట్టినట్టుగా సమాచారం.

 

  పుళల్‌లో ఉన్న ఆయన్ను తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు తగ్గ కసరత్తుల్ని నగర పోలీసులు వేగవంతం చేశారు. పచ్చముత్తు బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో అదే రోజు ఆయన్ను తమ కస్టడీకి తీసుకునే విధంగా కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. ఈ తంతంగా ఓ వైపు సాగుతుంటే, మరో వైపు పచ్చముత్తు మీద గతంలో వచ్చిన ఆరోపణలు, అణగదొక్కబడ్డ వ్యవహారాలు మళ్లీ తెరమీదకు వస్తుండడంతో, వాటిని కూడా విచారణ పరిధిలోకి తీసుకొచ్చే రీతిలో కార్యాచరణ సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.

 

  ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థల స్థలానికి సంబంధించి పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, బాధితులు ఒక్కక్కరు తెరమీదకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. తమకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని, పోలీసుల్ని ఆశ్రయించేందుకు కాటాన్‌కొళత్తూరు పరిసరాల్లోని బాధితులు ఉరకలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు పచ్చముత్తు, ఆయన వర్గీయుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నట్టు సినీ ఫైనాన్సియర్ ఒకరు కమిషనరేట్‌ను శనివారం ఆశ్రయించారు.

 

  సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ వస్తున్న తనకు వేందర్ మూవీస్ రూపంలో తీవ్ర కష్టాలు ఎదురయ్యాయని, ప్రశ్నిస్తే, బెదిరింపులు వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలంటూ కమిషనరేట్‌ను టీ నగర్‌కు చెందిన ముకుల్‌చంద్ ఫిర్యాదు చేయడం గమనించాల్సిన విషయం. ఇక,తమ నాయకుడ్ని అన్యాయంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఈ కుట్రలు అంటూ ఇండియ జననాయగ కట్చి వర్గాలు రెండోరోజులుగా పలుచోట్ల ఆందోళనకు దిగారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top