ప్రొఫెసర్ లక్ష్మికి రాజకీయ అండ!

ప్రొఫెసర్ లక్ష్మికి రాజకీయ అండ! - Sakshi


► వైద్య విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఐదు రోజులైనా జాడలేని నిందితురాలు

► ఆమె అరెస్టు కాకుండా భర్త డా.విజయ సారథి మంత్రాంగం


సాక్షి, హైదరాబాద్: గుంటూరు జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో యువ వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డా.లక్ష్మి ఐదు రోజులుగా కనిపించకుండా పోయారు. రాజకీయ జోక్యంతోనే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైద్య విద్యార్థులు నాలుగు రోజులపాటు ధర్నాలు, ర్యాలీలు చేస్తేగానీ లక్ష్మిని సస్పెండ్ చేయలేదంటే ఆమె వెనుక పెద్దతలకాయలే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ లక్ష్మి భర్త డా.గెడ్డం విజయసారథి రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అనుంగు శిష్యుడని సమాచారం.



గుంటూరు జనరల్ ఆసుపత్రిలో జనరల్ సర్జరీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉండే ఆయన రెండు నెలల క్రితం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏపీ చాప్టర్)లోకి అనూహ్యంగా వచ్చారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవి ఆయనను వరించింది. ప్రస్తుతం ప్రొఫెసర్ లక్ష్మి అదృశ్యం వెనుక, అరెస్టు చేయకుండా కాపాడడంలోనూ భర్త విజయసారథి కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రి కామినేనితోపాటు అధికార పార్టీ పెద్దలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.



లక్ష్మిని కేసు నుంచి తప్పించే యత్నం

తన ఆత్మహత్యకు ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని సంధ్యారాణి సూసైడ్ నోట్ రాసింది. అయినా లక్ష్మిని అరెస్టు చేయకపోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక డాక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆమెను కేసు నుంచి తప్పించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించినట్లు తెలిసింది.  ప్రొఫెసర్ లక్ష్మి వైద్య రంగానికే ఒక మచ్చ అని పీజీ వైద్య విద్యార్థులు విమర్శిస్తున్నారు. గురువారం వారు ధర్నా చేశారు.గుంటూరు జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌కు పీజీ వైద్యులు లేఖ రాశారు. ఇందులో ప్రొఫెసర్ లక్ష్మీ వాడిన పదజాలం, సంధ్యారాణిని వేధించిన తీరును ప్రస్తావించారు.



వివిధ విభాగాలకు చెందిన పీజీ వైద్య విద్యార్థులు ఈ లేఖను ప్రిన్సిపాల్‌కు అందజేశారు. కాగా దీనిపై సీబీఐ విచార ణ జరిపించాలని జూనియర్ వైద్యుల సంఘం మాజీ అధ్యక్షుడు పి.ఫణిమహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మరో వైపు డా.సంధ్యారాణి మరణాన్ని తట్టుకోలేక మిర్యాలగూడలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె భర్త డా.రవి పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ మలక్‌పేటలోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు వెంటిలేటర్‌పై  చికిత్స అందిస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top