పెట్రో కల్లోలం!

పెట్రో కల్లోలం!


23 వేల హెక్టార్లలో హబ్‌

2 లక్షల మంది తరలింపునకు కార్యాచరణ

45 గ్రామాల్లో ఉత్కంఠ

ప్రభుత్వ ఉత్తర్వులతో కలవరం

మహోద్యమానికి వ్యూహం




పెట్రో కెమికల్‌ హబ్‌ ప్రకటన కడలూరు, నాగపట్నం జిల్లాల్లో కల్లోలాన్ని సృష్టించింది. 23 వేల హెక్టార్లలో రూపుదిద్దుకోనున్న ఈ మెగా హబ్‌ నిమిత్తం 45 గ్రామాల్లోని రెండు లక్షల మంది ప్రజల్ని ఖాళీ చేయించబోతున్నారు. చాపకింద నీరులా ప్రభుత్వం రెండు రోజుల క్రితం జారీచేసిన ఉత్తర్వులు వెలుగులోకి రావడంతో మహోద్యమంతో తమ నిరసనకు తెలియజెప్పేందుకు ఆ గ్రామాల ప్రజలు సిద్ధం అవుతున్నారు.

సాక్షి, చెన్నై :  తమిళనాట మరో మహోద్యమానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి.  తమిళనాట వ్యవసాయం అనేదే మరి కొన్నేళ్లల్లో కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో పచ్చటి పంట పొలాలు సర్వనాశనం అయ్యే రీతిలో ప్రాజెక్టులకు పాలకులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.



కరువుతో ఇప్పటికే పంట పొలాలు బీడు భూములుగా మారాయి. కావేరి జలాలు అందక డెల్టా జిల్లాలో సాగుబడి పతనం అయింది. వేల హెక్టారుల్లో ఒకప్పుడు సాగిన వ్యవసాయం, ఇప్పుడు ఆరేడు లక్షల ఎకరాలకు పరిమితం అవుతుండడం బట్టి చూస్తే, అన్నదాత బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారింది. ఓవైపు  వర్షాభావ పరిస్థితులు అన్నదాతను కన్నీటి మడుగులో ముంచితే, మరోవైపు పచ్చటి పంట పొలాల్ని సర్వనాశనం చేయడం లక్ష్యంగా ప్రాజెక్టుల వేగం పెరుగుతుండడం గమనించాల్సిన విషయం.



ఇప్పటికే రాష్ట్రంలో పంట పొలాల వైపుగా మిథైన్‌ తవ్వకాలకు, గ్యాస్‌ పైప్‌లైన్లకు, హైడ్రో కార్బెన్‌ వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పెద్ద సమరమే సాగుతోంది. నెడువాసల్‌ వేదికగా, కదిరమంగళం వేదికగా నేటికీ పోరుబాట సాగుతున్న సమయంలో పాలకుల నిర్ణయం, కడలూరు, నాగపట్నం జిల్లాల్లో కల్లోలాన్ని రేపింది. పెట్రో కెమికల్‌ హబ్‌గా ఆ రెండు జిల్లాల్లోని 45 గ్రామాల్ని ఎంపికచేసి చడీ చప్పుడు కాకుండా ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయడాన్ని బట్టి చూస్తే, భవిష్యత్తుల్లో పంట పొలాలు రాష్ట్రంలో కనిపించేనా అనే ప్రశ్న తలెత్తక మానదు.

పెట్రో కల్లోలం

నాగపట్నం, కడలూరు జిల్లాల్లో అనేక గ్రామాలు సముద్ర తీర ప్రాంతాలు. తరచూ ఎదురయ్యే  ప్రకృతి వైపరీత్యాలకు ఈ జిల్లాల్లోని ప్రజలు తల్లడిల్లడం పరిపాటే. వ్యవసాయం, చేపల వేట ఇక్కడి మెజారిటీ శాతం ప్రజల జీవనాధారం. పారిశ్రామికంగా వెనుకబడిన ఈ జిల్లాల్ని గురిపెట్టి, పెట్రో కెమికల్‌ హబ్‌కు కొన్ని గ్రామాల్ని ఎంపిక చేసి ఉండడం వివాదానికి దారితీసింది. 92 వేల కోట్లతో పెట్రోల్‌ కెమికల్‌ ప్రాజెక్టును నెలకొల్పడం లక్ష్యంగా 23 వేల హెక్టార్ల స్థలాన్ని గుర్తించి ఉండడం గమనార్హం.



రాష్ట్ర గృహ నిర్మాణ, నగరాభివృద్ధి శాఖ జారీచేసిన ఉత్తర్వుల మేరకు కడలూరు జిల్లాలోని భువనగిరి, చిదంబరం డివిజన్లలోని 25, నాగపట్నం జిల్లాలోని శీర్గాలి, తరంగం బాడి డివిజన్లలోని 20 గ్రామాలను ఎంపికచేశారు. ఈ గ్రామాల్లోని రెండు లక్షల మందిని మరోచోటకు తరలించడం లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం అయ్యారు. ఈ ఉత్తర్వులు వెలుగులోకి రావడంతో ఆ రెండు జిల్లాల్లో ఎక్కడ చూసినా పెట్రో కల్లోలం చర్చే.  రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీచేసి ఉండటంతో, దీని వెనుక కేంద్రం హస్తం తప్పనిసరిగా ఉందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మహోద్యమం

వ్యవసాయాన్ని సర్వనాశనం చేయడంతో పాటు, తమ బతుకుల్ని బుగ్గి పాలు చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే జల్లికట్టు మొదలు కదిరామంగళం వరకు తమిళులకు వ్యతిరేకంగా కేంద్రం కుట్రపూరితంగా ముందుకు సాగుతోందని ధ్వజమెత్తుతున్నారు. ఈ ప్రయత్నాలను వీడేది అనుమానమే కావడంతో ఆదిలోనే అడ్డుకుని తీరుతామని, అన్ని గ్రామాల ప్రజలు ఏకం అవుదామన్న పిలుపుతో సంఘాలు, రాజకీయ పక్షాలు ముందుకు సాగుతున్నాయి.



మహోద్యమంగా కేంద్రం మెడలు వంచుదామని, రాష్ట్ర ప్రభుత్వం మరో మారు కేంద్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా నడ్డి విరుద్దామనే నినాదంతో ఆ గ్రామాల ప్రజలు పోరుబాటకు సిద్ధం అవుతున్నారు. ఆదిలోనే  ఉద్యమాన్ని అణగదొక్కే రీతిలో పాలకులు ఆ గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తుండటం గమనార్హం. ఇక, పీఎంకే అధినేత రాందాసు అయితే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తమిళనాడును సర్వనాశనం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకున్నట్టుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తీవ్ర కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో కలసి పోరాటాలకు పీఎంకే సిద్ధమని శనివారం  ప్రకటించారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top