హోదాపై కేంద్రం అబద్ధాలు

హోదాపై కేంద్రం అబద్ధాలు - Sakshi


చేనేత గర్జన సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

చంద్రబాబు చేనేత కార్మికులకు హామీ ఇచ్చి మాట తప్పారని ధ్వజం



సాక్షి, గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఓట్లకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలపై పదవుల్లోకి వచ్చాక ఎందుకు నిలబడటంలేదని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదుట రాష్ట్ర పద్మశాలీ సాధికారత సంఘం సోమవారం చేపట్టిన ‘చేనేత ఐక్య గర్జన’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సంఘం నేతలు చేపట్టిన సత్యాగ్రహ దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘం అధ్యక్షుడు కేఏఎన్‌ మూర్తికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.



అనంతరం జరిగిన సభలో పవన్‌ మాట్లాడుతూ.. కేంద్రం ఇప్పుడు స్పెషల్‌ ప్యాకేజీ అంటోందని, దానికి చట్టబద్ధత కల్పిస్తామంటూ మరోసారి మోసగిస్తోందని అన్నారు.  ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే నేరుగా చెప్పాలని, అప్పుడుæ వారిని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. పాదయాత్ర సమయంలో చంద్రబాబు చేనేత సమస్యలు తీరుస్తామని హామీలు ఇచ్చి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. తాను చేనేతలకు మద్దతు ఇస్తే వడ్డించే వాళ్లను వదిలేసి, ఎంగిలి విస్తర్లు ఏరుకునే వారి వద్దకు ఎందుకు వెళ్తారంటూ కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు. తాను ఆ మాటలకు గర్వపడుతున్నానని అన్నారు.



జనసేన పార్టీ ఏర్పడి మూడేళ్ళు అవుతున్న సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన పార్టీ వెబ్‌సైట్‌ ప్రారంభిస్తున్నామని చెప్పారు.పద్మశాలి సాధికారత సంఘం అధ్యక్షుడు కె.ఎ.ఎన్‌.మూర్తి మాట్లాడుతూ చేనేత గర్జన సభకు ప్రజలు రాకుండా టీడీపీ నేతలు నేరుగా ఆదేశాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చేనేత బిడ్డలు చేపట్టిన సత్యాగ్రహం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్‌భాస్కర్‌ అన్నారు. వృత్తిని నమ్ముకుంటే మిగిలేది ఆకలి చావులేనా అని కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన ఎమ్మెల్సీ కేపీ కొండయ్య ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని వైఎస్సార్‌ సీపీ చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు చెప్పారు. చేనేత  ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top