ఎంజీఆర్‌ బాటలో పన్నీరు

ఎంజీఆర్‌ బాటలో పన్నీరు


► న్యాయం కోసం పయనం

సాక్షి, చెన్నై: దివంగత పురట్చితలైవర్‌ ఎంజీఆర్‌ బాటలో మాజీ సీఎం పన్నీరుసెల్వం ప్రజలో్లకి వెళ్లేందుకు నిర్ణయించారు. గతంలో ఎంజీఆర్‌ అనుసరించినట్టే, తాను సైతం ‘న్యాయం కోసం’ అంటూ కేడర్‌లోకి చొచ్చుకు వెళ్లనున్నారు. అన్నాడీఎంకే మూడుగా చీలడంతో ఎవరి వ్యూహాలతో వారు కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు.


స్థానిక ఎన్నికల్లో తమ సత్తాను చాటుకునేందుకు తగ్గ పయనానికి సిద్ధం అవుతున్నారు. చిన్నమ్మ శశికళ శిబిరం ప్రస్తుతం అధికారంలో ఉండడంతో, మిగిలిన రెండు శిబిరాలు ప్రజా, కేడర్‌ మద్దతు లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి. ఓ వైపు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై సిద్ధం అవుతుంటే, మరోవైపు అన్నాడీఎంకే తమదేనని చాటుకునే విధంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం కార్యాచరణలో నిమగ్నం  అయ్యారు. కేడర్, పార్టీ వర్గాలతో సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు.


ఆదివారం కూడా ఈ సమావేశం సాగింది. ఇందులో సీనియర్లు నత్తం విశ్వనాథన్, పొన్నయ్యన్, కేపీ మునుస్వామి పాల్గొన్నారు. అన్నాదురై  మరణంతో డీఎంకేను కరుణానిధి ఏ విధంగా తన గుప్పెట్లోకి తీసుకున్నారో, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ, అన్నాడీఎంకే ఆవిర్భావానికి నాంది పలుకుతూ అప్పట్లో ఎంజీఆర్‌ సాగించిన పయనాన్ని ఆసరాగా తీసుకునేందుకు నిర్ణయించారు. ఎంజీఆర్‌ బాటలో ‘న్యాయం కోసం ’ అన్న నినాదంతో కేడర్, ప్రజలో్లకి చొచు్చకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ పయనం ఏ జిల్లా నుంచి శ్రీకారం చుటా్టలో అన్న విషయంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, సమావేశానంతరం పొన్నయ్యన్  మీడియాతో మాట్లాడుతూ, అమ్మ మరణం మిస్టరీపై తీవ్రంగానే స్పందించారు.



శశికి అంటుకోలేదుగా : పన్నీరు శిబిరంలోని సీనియర్‌ నేత పొన్నయ్యన్  మాట్లాడుతూ అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు పలుమార్లు ఆమెను చూడడానికి ప్రయత్నించామన్నారు. అయితే, అమ్మకు భయంకరైన అంటు రోగం వచ్చినట్టు, ఈ ప్రభావం ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నట్టు ప్రచారాన్ని గుప్పించారని ఆరోపించారు.


అయితే, అమ్మ వెన్నంటి శశికళ మాత్రమే ఉన్నారని, ఆమెకు మాత్రం ఆ రోగం ఎందుకు రాలేదని ప్రశ్నించారు.పోయెస్‌ గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రికి వచ్చేటప్పుడే అమ్మకు స్ప్పహ లేదన్న సమాచారాలు వస్తుండడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రి, శశికళకు మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉన్నట్టుందని, అందుకే అమ్మ ఆరోగ్య పరిస్థితి, మరణం గురించి పొంతనలేని సమాధానాలు, ప్రకటనల్ని చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. న్యాయ విచారణ జరిపించడం ద్వారా అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చి తీరుతాయన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top