బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం

బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం


బెంగళూరు(కర్ణాటక): కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మంగళవారం అత్యధికంగా 180 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది. 1890వ సంవత్సరం తర్వాత కురిసిన అతి భారీ వర్షం ఇదేనని అధికారులు చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు దాదాపు మూడు గంటలపాటు కురిసిన వర్షంతో నగరం అతలాకుతలమయింది. ఆగస్టులో ఇంత వాన కురియడంతో వందేళ్ల తర్వాత ఇదే ప్రథమమని అంటున్నారు.



ఒక్కసారిగా కుండపోతగా వాన పడటంతో మురుగు కాల్వలు పొంగిపొర్లి రహదారులు కనిపించకుండాపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో జనం నానా అవస్థలు పడ్డారు. చెట్లు, స్తంభాలు కూలిపడటంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.





కాగా, 1890 ఆగస్టులో నగరంలో 166 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయినట్లు రికార్డులు చెబుతున్నాయని అధికారులు తెలిపారు. ఇంతటి వర‍్షపాతాన్ని వాతావరణ హెచ్చరికల కేంద్రం కూడా పసిగట్టలేకపోయిందని అన్నారు. ముందుగా ఊహించిన దాని కంటే నాలుగు రెట్లు అధికంగా వాన కురిసిందని చెప్పారు. అయితే, రుతుపవనాల ప్రభావంతో దట్టమైన మేఘాలు అలుముకుని ఉన్నందున ఒక్కోసారి ఇట్లాంటి కుండపోత వానలు పడటం సహజమేనన్నారు. భారీ వర్షంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తీవ్ర అంతరాయం కలిగింది.





Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top