నీట్‌ రగడ

నీట్‌ రగడ


సర్కారుపై ప్రతిపక్షాల ఫైర్‌

మంత్రులతో వాగ్వాదం

వాకౌట్‌

కరుణకు వెసులుబాటు

8 ముసాయిదాలు

ఇక, మరింతగా ముందుకు జాలర్లు


రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం ‘నీట్‌’ వ్యవహారంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఢీకొట్టాయి. నీట్‌ రూపంలో రాష్ట్రంలోని విద్యార్థులకు వైద్య కోర్సులు అందని ద్రాక్షగా మారినట్టు మండిపడ్డాయి. మంత్రులతో వాగ్వాదం హోరెత్తడం, స్పీకర్‌ సైతం పాలకులకు మద్దతుగా స్పందించడంతో సభనుంచి ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. ఇక, సభకు హాజరయ్యే విషయంలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి వెసులుబాటు కల్పించారు. సభలో ఎనిమిది ముసాయిదాలను ప్రవేశ పెట్టారు.

సాక్షి, చెన్నై : రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మంగళవారం మళ్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ ‘నీట్‌’ రూపంలో విద్యార్థులు పడుతున్న పాట్లను ఏకరువు పెట్టారు. వైద్య కోర్సులు అందని ద్రాక్షగా మారాయని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు.



అవకాశాలు కలిసివచ్చినా, నీట్‌ మినహాయింపు సాధనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉండాలని పేర్కొన్నారు. ఇకనైనా స్పందించాలని డిమాండ్‌చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్ని పరిగణనలోకి తీసుకుని నీట్‌ మినహాయింపునకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని పట్టుబట్టారు. దీంతో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ స్పందిస్తూ, బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్టు, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మొక్కుబడిగా సమాధానం ఇవ్వడం ప్రతిపక్షాల్లో  ఆగ్రహం పెల్లుబికింది.



బాధ్యత గల మంత్రి ఇకమీద చర్యలకు సిద్ధం కాబోతున్నట్టుగా స్పందించడం శోచనీయమని విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో మంత్రులతో డీఎంకే సభ్యుల వాగ్వావాదం సభలో హోరెత్తింది. వీరిని బుజ్జగించే క్రమంలో స్పీకర్‌ ధనపాల్‌ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, నీట్‌ చర్చ ఇక ముగిసినట్టు వ్యాఖ్యానించడాన్ని డీఎంకేతో పాటుగా, కాంగ్రెస్, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌లు తీవ్రంగా పరిగణించారు. సభ నుంచి ఒకరి తర్వాత మరొకరు వాకౌట్‌ చేశారు. కాగా, వాగ్వాద సమయంలో డీఎంకే ఎమ్మెల్యే పొన్ముడిని పలుమార్లు స్పీకర్‌ తీవ్రంగా మందలించడం గమనార్హం.



మరింతగా ముందుకు జాలర్లు

సాగరంలో చేపల వేట నిమిత్తం మరింత ముందుకు సాగేందుకు జాలర్లకు మార్గం సుగమం అయింది. ఇందుకు తగ్గ ముసాయిదా అసెంబ్లీలో దాఖలైంది. మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ దాఖలు చేసిన ముసాయిదాలతో సముద్రంలో చేపల వేటకు సరిహద్దును పొడిగిస్తూ తీర్మానం చేశారు. ఆ మేరకు ఇక, ఐదు నాటికల్‌ మైళ్ల దూరం వరకు సముద్రంలో చేపల వేటకు అవకాశం కల్పించారు. అలాగే, జాలర్ల హక్కులు, సంక్షేమం లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, క్రీడ, వ్యవసాయం, పశు వైద్య వర్సిటీల్లో వీసీల నియామకంపై ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించే రీతిలో ఆయా శాఖల మంత్రులు ముసాయిదాలను అసెంబ్లీలో దాఖలు చేశారు. విద్యుత్, ఒప్పందాలు, ఉద్యోగుల చట్ట నిబంధనల విషయంలోనూ ముసాయిదాలు సభకు చేరాయి.



కరుణకు వెసులు బాటు

ప్రతి సభ్యుడు సమావేశ సమయాల్లో ఏదో ఒక్కసారైనా సభ లాబీలో ఉన్న పుస్తకంలో సంతకం చేయాల్సిన అవసరం ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలకు డీఎంకే అధినేత కరుణానిధి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం అనారోగ్యం,వయోభారంతో ఆయన గోపాల పురం ఇంటికి పరిమితం కావడమే. దీంతో ఆయనకు సభకు హాజరయ్యే విషయంలో వెసులుబాటు , మినహాయింపు కల్పించాలని డీఎంకే తరఫున ప్రత్యేక తీర్మానం సభ దృష్టికి తెచ్చారు. దీనిని స్పీకర్‌ ధనపాల్‌ అంగీకరించారు. కరుణానిధి సభకు హాజరు కావాల్సిన అవసరం లేదని, సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాక హాజరు కావచ్చంటూ స్పీకర్‌ ప్రవేశపెట్టిన తీర్మానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం విశేషం.



సాయం పెంపు

విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే అగ్నిమాపక సిబ్బంది కుటుంబానికి సాయం పెంచుతూ అసెంబ్లీలో సీఎం పళని స్వామి ప్రకటించారు. కొడుంగైయూర్‌ ప్రమాదాన్ని పరిగణించి, ఎవరైనా సిబ్బంది మరణిస్తే, ఇక రూ.పది లక్షలు సాయంగా పేర్కొన్నారు. అలాగే, ఏదేని అవయవాలను కోల్పోయిన సిబ్బందికి రూ.నాలుగు లక్షలు, మంటల్లో గాయపడ్డ వారికి రూ.రెండు లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వ సాయం దక్కుతుందని ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top