తమిళనాడులో స్తంభించిన జనజీవనం

తమిళనాడులో స్తంభించిన జనజీవనం - Sakshi


చెన్నై: రైతులకు మద్దతుగా అఖిలపక్షాల ఆధ్వరంలో జరుగుతున్న రాష్ట్ర బంద్ తో మంగళవారం తమిళనాడులో జనజీవనం స్తంభించింది. దుకాణాలు, హోటళ్లు మూతబడ్డాయి. ఆటో, వ్యాన్, లారీ, ప్రైవేటు వాహనాల సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. రాజధాని చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో బంద్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా థియేటర్లలో ప్రదర్శనలు, షూటింగ్‌లు ఆగిపోయాయి. రైల్‌ రోకోలు, రాస్తారోకోలకు డీఎంకే నేతృత్వంలోని అఖిల పక్షం సిద్ధమైంది.



తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ, పీఎంకేలు బంద్‌కు దూరం అని ప్రకటించగా, ఎండీఎంకే మాత్రం తటస్థంగా వ్యవహరిస్తోంది. డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకేల అనుబంధ రవాణా సంస్థలు బంద్‌ ప్రకటించడంతో ప్రభుత్వ బస్సుల సేవలు ఆగే అవకాశాలు ఉన్నాయి. ఆటో, వ్యాన్, లారీ, ప్రైవేటు వాహనాల సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో ఆ సేవలు ఆగినట్టే. అన్ని రకాల సేవల నిలుపుదలతోపాటుగా, తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేసే విధంగా రైల్‌రోకోలు, రాస్తారోకోలు సాగించేందుకు నేతలు సిద్ధం అయ్యారు.



తిరువారూర్‌లో జరిగే నిరసనకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ నేతృత్వం వహించనున్నారు. అన్ని రకాల సేవలు బంద్‌ కానున్న నేపథ్యంలో  అన్నా కార్మిక సంఘం ద్వారా బస్సుల్ని రోడ్డెక్కించేందుకు రవాణా మంత్రి ఎంఆర్‌ విజయ భాస్కర్‌ చర్యలు చేపట్టారు. బస్సుల మీద ప్రతాపం చూపించే యత్నం చేస్తే కఠినంగా వ్యవహరింస్తామని హెచ్చరికలు చేశారు. ఈ బంద్‌ను అడ్డుకునే విధంగా రాష్ట్రవ్యాప్తంగా భద్రతను  ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. లక్షల మంది సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నం అయ్యారు. ఈ బంద్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌ వ్యతిరేకించారు. బంద్‌ ముసుగులో శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు.



ఇక, ఢిల్లీలో నిరసనకు విరామం ఇచ్చిన రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలోని 70 మంది అన్నదాతలు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఉదయం చెన్నైకు చేరుకునే ఈ బృందం రైల్‌ రోకో చేయాలని నిర్ణయించడంతో చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బంద్‌ నేపథ్యంలో రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉందని చాటుకునే రీతిలో ఆగమేఘాలపై పంట బీమా నష్ట పరిహారం పంపిణీకి సీఎం ఎడపాడి కే పళనిస్వామి చర్యలు తీసుకోవడం గమనార్హం. సోమవారం సాయంత్రం సచివాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురు రైతులకు పరిహారం పంపిణీ చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top