ఏ ముహూర్తంలో ప్రమాణం చేశారో?

ఏ ముహూర్తంలో ప్రమాణం చేశారో?


- బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఠాక్రే

- ఫడ్నవీస్ ప్రభుత్వానికి  చురకలంటించిన ఉద్ధవ్

- సీఎం ఇబ్బందుల్లో పడే అవకాశముందని వ్యాఖ్య

సాక్షి, ముంబై:
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ మంత్రులపై వస్తున్న ఆరోపణ లు, వివాదాలపై శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం ఫడ్నవీస్, మంత్రి మండలి ఏ ముహుర్తంలో ప్రమాణస్వీకారం చేశారో మరోసారి పరిశీలించాలని ఎద్దేవా చేశారు. సామ్నా దినపత్రికలో ‘ఆది బసూ మగ్ బోలూ’ (ముందు కూర్చుందాం, ఆ తర్వాత మాట్లాడదాం) అనే శీర్షికతో వచ్చిన సంపాదకీయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ మంత్రులకు తనదైన శైలిలో ఉద్దవ్ ఠాక్రే చురకలంటించారు.



కొద్ది రోజులుగా ఫడ్నవీస్ కేబినె ట్‌లోని మంత్రులపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఫడ్నవీస్ వల్లే గంటన్నరపాటు ఆలస్యమైందన్న వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లిన రోజున ప్రవీణ్ పరదేశి అనే ఐఏఎస్ అధికారి వీసా, పాస్‌పోర్టుతోపాటు మరికొన్ని పత్రాలు ఇంటివద్ద మరిచిపోయారని, దీంతో విమానం గంటపాటు ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై  పీఎంఓ కార్యాలయం కూడా నివేదిక కోరింది.



అయితే సీఎం ఫడ్నవీస్ ఘటన విషయమై సహనం కోల్పోయి మీడియాపై రుసరుసలాడారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని ఉద్ధవ్ పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఫడ్నవీస్ మంత్రిమండలిలోని నీటిపారుదల శాఖ మంత్రి లోణికర్ నకిలీ డిగ్రీ వివాదం, అనంతరం వినోద్ తావ్డే బోగస్ యునివర్సిటీ అంశం బయటికివచ్చింది. దీంతోపాటు తావ్డే శాఖలో రూ. 191 కోట్లు, పంకజా ముండే శాఖలో రూ. 206 కోట్ల కాంట్రాక్టుల కుంభకోణం విషయంపై వివాదాలు బహిర్గతమయ్యాయి.



దీంతో దేశవ్యాప్తంగా ఫడ్నవీస్ ప్రభుత్వంపై విమర్శలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ.. శివసేన లేకుండానే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ఇలా జరగడం మహారాష్ట్ర కులదైవమైన శివాజీ మహారాజుకు నచ్చలేదేమోనన్నారు. అందుకే ఫడ్నవీస్ ప్రభుత్వం అనేక వివాదాల్లో చిక్కుకుంటోందని సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రమాణస్వీకారం ఎప్పుడు చేశారనేదానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top