మొక్కులపై ఆలోచించి మాట్లాడండి: కేసీఆర్‌

మొక్కులపై ఆలోచించి మాట్లాడండి: కేసీఆర్‌ - Sakshi

వరంగల్‌ రూరల్‌: దేవుళ్లకు మొక్కులు సమర్పించే విషయంలోనూ కొందరు విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? అని ప్రశ్నించారు. దేవుడి మొక్కు విషయంలో కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి లాంటి వారు దేవుడి మొక్కులపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

 

ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని వీరభద్ర స్వామిని మొక్కుకున్నానని గుర్తు చేశారు. శివుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజున కురవి వీరభద్రస్వామికి బంగారు కోర మీసాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నానని తెలిపారు. కాగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామికి బంగారు కోర మీసాలు సమర్పించి మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.

 

పాత వరంగల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం

కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు, డోర్నకల్, మరిపెడ అభివృద్ధికి రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. డోర్నకల్ నియోజకవర్గంలోని 77 గ్రామపంచాయతీలకు రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. వరంగల్ రూరల్‌ జిల్లాలో టెక్స్‌టైల్స్ పార్కుకు భూసేకరణ పూర్తయ్యిందని తెలిపారు. త్వరలోనే టెక్స్‌టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాను ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా సస్యశ్యామలం చేస్తానని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.  త్వరలోనే రెండు పంటలకు సరిపడా నీరు అందిస్తామన్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top