లాటరీ కుంభకోణంలో ఎవరినీ వదలం


హోం మంత్రి కేజే జార్జ్

సింధనూరు టౌన్ :
రాష్ట్రంలో సింగిల్ డిజిట్ లాటరీ కుంభకోణానికి సంబంధించి ఎవరినీ వదలమని, సీబీఐ దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయని,  ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల వారు లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని రాష్ట్ర హోం మంత్రి కేజే జార్జ్ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.



పోలీసు శాఖలో అంతా సజావుగా ఉందని, అధికారులు చక్కగా పని చేస్తున్నారన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీల వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సింగిల్ డిజిట్ లాటరీ కుంభకోణంలో రాజకీయ నాయకులు, అధికారులు ఎవరున్నా రక్షించే ప్రశ్నే లేదన్నారు. అందువల్లే ఎలాంటి గందరగోళానికి అవకాశం కల్పించకుండా సీబీఐ దర్యాప్తునకు అప్పగించామన్నారు. దర్యాప్తు నివేదిక వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు.



తనపై సముదాయ పరివర్తన సమితి అధ్యక్షుడు ఎస్‌ఆర్ హిరేమఠ్ చేసిన ఆరోపణలను హాస్యాస్పదమని కొట్టిపారేశారు.  ఏవైనా ఆధారాలు ఉంటే లోకాయుక్తకు అప్పగించాలని సూచించారు. కనకగిరి నియోజకవర్గంలో ఓ విద్యార్థి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామన్నారు.



కేబినెట్ విస్తరణ పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారమని, తన శాఖ మారవచ్చు లేదా తనకు మంత్రి పదవి లభించక పోవచ్చు, ఆ విషయంపై తానేమీ స్పందించలేనన్నారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పార్టీ సామాన్య కార్యకర్త మాదిరిగా శాయశక్తులా న్యాయం చేస్తానన్నారు. ఈసందర్భంగా మంత్రులు డీకే శివకుమార్, కృష్ణభైరేగౌడ, ఎమ్మెల్యేలు హంపనగౌడ, ప్రతాప్‌గౌడ పాటిల్, కాడా అధ్యక్షుడు ఏ.వసంతకుమార్, రిజ్వాన్ అర్షద్, మాజీ మంత్రి బసవరాజ్ పాటిల్ అన్వరి, జెడ్పీ సభ్యులు చందూసాబ్, శివనగౌడ, అమరేశ్, దురుగప్ప, రాజుగౌడ తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top