జీవిత పయనంలో కష్టమైనదే సరైన దారి: వైఎస్ జగన్




వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని పేదవారందరికీ మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో వెంకటప్ప స్కూలును ఏర్పాటుచేసినట్లు వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పులివెందులలోని వెంకటప్ప స్కూలు పదో వార్షికోత్సవంలో పాల్గొన్నారు. జీవిత ప్రయాణంలో రెండు దారులు కనిపిస్తాయని, వాటిలో ఒకదారి సులభమైనది, మరొకటి కష్టమైనదని చెప్పారు. అయినా కష్టమైనదే కరెక్టయిన దారి అన్నారు. సులభమైన దారి కాపీలు కొట్టడం, సులభంగా పాసయ్యే మార్గాలు, మార్కులు తెచ్చుకునే మార్గాలని.. కానీ ఆదారిలో వెళ్తే తాత్కాలికంగా సాధించగలమేమో గానీ, తర్వాత మాత్రం ఫెయిలవుతామన్నారు. 

 

కష్టమైనది అనిపించే దారిలో కష్టపడి మన జీవితంలో ఈరోజు పడే కష్టాన్ని జీవితంలో రేపు విజయంగా మార్చుకోవచ్చని, అందుకు చదువుతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. చదువు నుంచి జీవితం వరకు ఇలాగే జరుగుతుందన్నారు. జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు. సులభమైన దారిలో పోతే క్యారెక్టర్, క్రెడిబిలిటీ రెండూ పోతాయని.. అదే కొంచెం కష్టపడితే ఈ రెండు రావడంతో పాటు దీర్ఘకాలంలో విజయాలు సాధిస్తారని చెప్పారు. 


దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురువు వెంకటప్ప పేరుతో ఏర్పాటుచేసిన ఈ స్కూల్లో ఎవరి వద్ద నుంచి పైసా ఫీజు కూడా తీసుకోరని, వైఎస్ఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తోందని ఆయన చెప్పారు. ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ అభినందనలు చెబుతున్నామన్నారు. ఈ పాఠశాలలలోని విద్యార్థులందరూ బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సాక్షి గ్రూపు ఛైర్‌పర్సన్ భారతీరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


 


 


 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top