ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదు

ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదు - Sakshi


- వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టీకరణ

- హోదా వచ్చేంతవరకూ వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది

 

 సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో నిధులు, రాయితీలు వస్తాయని, వాటి విలువ రూ.1.45 లక్షల కోట్లని చెప్పారు. హోదా ఇవ్వకుండా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఈ నిధులకు సమానం కాదని పేర్కొన్నారు. దీనిపై బహిరంగ చర్చకు వచ్చే వారెవరైనా ఉంటే తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. విశాఖకు రైల్వేజోన్, విద్యా సంస్థలను కూడా ప్రత్యేక హోదా బిల్లులో పొందుపరిచారని, వాటిని సాధించేవరకూ వదిలేది లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ర్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు మోసం చేశాయని దుయ్యబట్టారు.



 పవన్ కల్యాణ్‌ను స్వాగతిస్తాం

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడొచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆచితూచి విమర్శలు చేశారని, అయితే, ప్రత్యేక హోదాపై ఆయన పోరాడతాననడాన్ని తాము స్వాగతిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన వైఎస్సార్‌సీపీతో కలసి పోరాటం చేయడానికి ముందుకొస్తే తాము స్వాగతిస్తామన్నారు.



 కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు

 ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన ద్రోహుల పార్టీ కాంగ్రెస్‌తో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. రాష్ర్ట ప్రజల అభిమతానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసి, జనానికి తీరని ద్రోహం చేసిన ద్రోహుల పార్టీతో తాము కలిసేది లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్థమైందని, అందుకే రాష్ర్టంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేం దుకు సాహసించడం లేదన్నారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో దీక్ష చేశారని, ఇకపైనా ఇదే ఒరవడి  కొనసాగుతుందని తెలిపారు.



 ఏపీ అప్పుల వాటా రూ.1.50 లక్షల కోట్లు

 రాష్ట్ర విభజన తర్వాత  ఆర్థిక లోటుతో ఉన్న ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల అప్పులు వాటాగా వచ్చాయని వి.విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా అనకాపల్లిలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top