రంగంలోకి నిర్మల సీతారామన్‌..

రంగంలోకి నిర్మల సీతారామన్‌.. - Sakshi


అమిత్‌ షా కొత్త అడుగు

తమిళనాట ప్రాధాన్యత పెంపు




సాక్షి, చెన్నై : తమిళనాట బలాన్ని పుంజుకోవడం లక్ష్యంగా బీజేపీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న నిర్మల సీతారామన్‌ను రంగంలోకి దించనుంది. తమిళనాడుకు సుపరిచితురాలుగా ఉన్న ఆమెకు ప్రాధాన్యతను పెంచేందుకు నిర్ణయించారు. ఆమె నేతృత్వంలో బీజేపీ తమిళనాట కొత్త పుంతలు తొక్కే రీతిలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యూహరచన చేసి ఉన్నారు.



లోక్‌ సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమిళనాట బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ కూటమి కొనసాగుతుందని భావించారు. అయితే, మధ్యలో కూటమిలో చీలిక అనివార్యం కావడంతో డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు తలా ఓ దారి అన్నట్టుగా పయనం సాగించే పనిలో పడ్డాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా నిలవక తప్పలేదు. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పూర్తి దృష్టిని తమిళనాడు మీద కేంద్రీకరించింది. అమ్మ జయలలిత మరణంతో తమిళనాట పాగా వేయడానికి కమలనాథులు తీవ్ర వ్యూహ రచనల్లో ఉన్నారని చెప్పవచ్చు.



అన్నాడీఎంకేలో బలమైన నాయకులు ఇక లేని దృష్ట్యా, ఆ పార్టీ ప్రభుత్వాన్ని  తన గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నాల్లో  కమలం ఢిల్లీ పెద్దలు  సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే, బలమైన నాయకత్వం అవసరమన్న విషయాన్ని పరిగణించారు. అన్నాడీఎంకే బలం, బీజేపీ బలంతో పాటుగా ఇతర పార్టీల్ని కలుపుకుని ముందుకు సాగడం ద్వారా డిఎంకేకు చెక్‌ పెట్ట వచ్చన్న ధీమా బీజేపీ బాస్‌ అమిత్‌షాలో నెలకొంది. అందుకే తన వ్యూహాల అమలు లక్ష్యంగా ఈనెల 22 నుంచి మూడు రోజులు తమిళనాట పర్యటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి బలమైన నేతగా నిర్మల సీతారామన్‌ను రంగంలోకి దించేందుకు నిర్ణయించడం గమనార్హం.



పూర్తిస్థాయిలో నిర్మల సీతారామన్‌ సేవలు

1959 ఆగస్టు 18వ తేదీన నారాయణ సీతారామన్, సావిత్రి దంపతులకు మదురైలో నిర్మల సీతారామన్‌ జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా తమిళనాటే సాగింది. తిరుచ్చిలో బీఏ పట్టా పొందారు. ఢిల్లీలో పరిశోధనలతో పీహెచ్‌డీ చేశారు. తమిళనాడుకు చెందిన నాయకురాలైనా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆమెను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. కేంద్ర సహాయమంత్రి పదవిని సైతం కట్టబెట్టారు. కేంద్రమంత్రి హోదాలో తమిళనాట ఇటీవల కాలంగా ఆమె పర్యటనలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి.


ఢిల్లీలో పెద్దలు ప్రకటించాల్సిన తమిళనాడుకు చెందిన కొన్ని కీలక విషయాల్లోని అంశాలను నిర్మల సీతారామన్‌ ఇక్కడ వెల్లడిస్తూ రావడం గమనించాల్సిన విషయం. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే నీట్‌కు ఏడాది మినహాయింపు విషయంగా తన నిర్ణయాన్ని తమిళనాడుకు వచ్చి మరీ ఆమె ప్రకటించడం, తదుపరి ఆగమేఘాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ప్రవేశ పెట్టేందుకు సిద్ధం కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు.



వాక్చాతుర్యంతో పాటు విద్యార్హతలు కలిగిన నిర్మల సీతారామన్‌ సేవల్ని పూర్తి స్థాయిలో తమిళనాడులో ఉపయోగించుకోవడం ద్వారా తమ బలం మరింతగా పెరగడంతో పాటు డీఎంకేకి దీటుగా ఎదిగే అవకాశం ఉందని అమిత్‌ షా అంచనా వేసినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీలో ప్రజాకర్షణ ఉన్న వాళ్లు అరుదే కావడంతో, ఆ లోటును నిర్మల సీతారామన్‌ ద్వారా భర్తీచేసి, అధికారం లక్ష్యంగా ముందుకు సాగేందుకు అమిత్‌ షా సర్వాస్త్రాలతో చెన్నైలో అడుగు పెట్టబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అధికార పగ్గాలు తమ గుప్పెట్లోకి చేరిన పక్షంలో బీజేపీ సీఎంగా నిర్మల సీతారామన్‌ పగ్గాలు చేపట్టేందుకు తగ్గ ప్రయత్నాలతో తమిళనాట మూడు రోజుల పాటు అమిత్‌ పర్యటన సాగనుందని కమలనాథులు పేర్కొనటం గమనార్హం.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top